ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు గ్రామీణం... ఎవరిది విజయం? - ycp

నెల్లూరు గ్రామీణ నియోజవర్గంలో ఎన్నికలు ఈ సారి ఉత్కంఠభరితంగా మారాయి. తెలుగుదేశం పార్టీ మొదట ఖరారు చేసిన అభ్యర్థి ఆదాల 10 రోజులు ప్రచారంలో పాల్గొని... అనంతరం పార్టీ మారారు. వైకాపా నుంచి నెల్లూరు లోక్​సభ అభ్యర్థిగా పోటీలో దిగారు. తెదేపా మరో అభ్యర్థిని ప్రకటించడానికి జాప్యం జరిగినా... మైనారిటీ వర్గానికి చెందిన బలమైన నేత అబ్దుల్​ అజీజ్​ను బరిలో నిలిపారు. వైకాపా నుంచి స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరి మధ్యా పోటీ నువ్వానేనా అన్నట్లు ఉంది.

నెల్లూరు గ్రామీణం... ఎవరిది విజయం?

By

Published : Mar 28, 2019, 8:03 AM IST

నెల్లూరు గ్రామీణం... ఎవరిది విజయం?
2014 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా... భాజపాకు అభ్యర్థిత్వాన్ని కేటాయించింది తెదేపా. ఉమ్మడి అభ్యర్థిగా సన్నపురెడ్డి సురేష్​రెడ్డి పోటీ చేయగా... ఆయనపై వైకాపా అభ్యర్ధి శ్రీధర్​రెడ్డి 25,653 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఇక్కడ శ్రీధర్​రెడ్డి రెండోసారి పోటీ పడుతున్నారు. తమ అభ్యర్థిగా నగర మేయర్ అబ్దుల్​ అజీజ్​ను తెదేపా బరిలోకి దింపింది. నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో అబ్దుల్​ అజీజ్ ఆలస్యంగా వచ్చినా... ప్రచారంలో దూసుకుపోతున్నారు.

నగర మేయర్​గా అబ్దుల్ ​అజీజ్ చేసిన అభివృద్ధికి ఓటర్లు ఆకర్షితులవుతారని అధికార పార్టీ భావిస్తోంది. ఒకేసారి 1500 మంది జనసేన కార్యకర్తలు అబ్దుల్​ ఆధ్వర్యంలో చేరడంతో పార్టీకి బలం చేకూరింది. నెల్లూరు నగరంలో మొత్తం 54 డివిజన్లు ఉన్నాయి. అందులో.. 18 డివిజన్లు నెల్లూరు నగర నియోజవర్గంలోకి... 26 డివిజన్లు నెల్లూరు గ్రామీణంలోకి వస్తాయి. 70 శాతం ఓట్లు నగరంలోని డివిజన్లలో ఉండటం తెదేపా అభ్యర్థి అబ్దుల్​అజీజ్​కు కలిసొస్తుందన్న ధీమా.. తెదేపా శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

వైకాపా అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ఇప్పటికే చుట్టేశారు. ప్రజలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. అయినా... ఎమ్మెల్యేగా ఆశించిన అభివృద్ధి చేయలేదనే విమర్శలున్నాయి. క్రికెట్ బెట్టింగ్ కేసులు... పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం వంటి ఆరోపణలతో ప్రజల్లో శ్రీధర్​రెడ్డిపై వ్యతిరేకత పెరిగింది. అయినా గెలుపు తనదేనని కోటంరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

2 ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు జనసేన నుంచి చెన్నారెడ్డి మనుక్రాంత్​రెడ్డి, కాంగ్రెస్ నుంచి వెంకట్రావు, భాజపా నుంచి కరణం భాస్కర్ బరిలో ఉన్నారు. జనసేనాని పవన్​కళ్యాణ్ నెల్లూరు జిల్లాలో 2 సార్లు పర్యటించారు. అయినా ఆ పార్టీ అభ్యర్థి మూడో స్థానానికి పరిమితం కావొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 54 వేల 585 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళలు లక్షా 30వేల 472 మంది. 2014 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థికి 79 వేల 103 ఓట్లు వచ్చాయి. తెదేపా మద్దతుతో బరిలో నిలిచిన భాజపా అభ్యర్థికి 53 వేల 450 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, జనసేన కూటమి అభ్యర్థి ఎన్ని ఓట్లు చీలుస్తారు... ఇది ఎవరి గెలుపు ఖరారు చేస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details