నెల్లూరు నగరంలో రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలతో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. నగర పాలక సంస్థ పరిధిలో మెుత్తం 54 డివిజన్లు ఉండగా...ప్రతి డివిజన్లోనూ రహదారుల సమస్య వేధిస్తోంది. ప్రధాన రహదారి నుంచి వెళ్లే ప్రతి రోడ్డు దెబ్బతింది. ఫతేఖాన్ పేట, మూలాపేట, రంగనాయకులస్వామి దేవాలయ ప్రాంతం, మైపాడ్ రోడ్డు, హరనాథ్పురం, ఎన్టీఆర్ నగర్ వైపు వెళ్లే రహదారులు గుంతలమయంగా మారాయి. పైప్ లైన్ల కోసం సిమెంట్ రోడ్లను తవ్వేయటంతో ఆ రూట్లలో వెళ్లేందుకు వాహనదారులు జంకుతున్నారు.
గత మూడేళ్లుగా రహదారుల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా... అధికారులు స్పందించటం లేదు. భారీ వర్షాలకు రోడ్లపై వరద నీరు చేరటంతో బురదమయమై...వాహన దారులు ఇక్కట్లపాలవుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.