స్థిరాస్తి వ్యాపారి విజయ భాస్కర్ రెడ్డి హత్య కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో కీలక నిందితుడు త్రిలోక్‌నాథ్ బాబా ఉన్నాడు. త్రిలోక్నాథ్ను హైదరాబాద్ ఎస్వోటీ పోలీసులు కేరళలో అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్ రెడ్డి హత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు. బాబాతో పాటు మరో నిందితుడు కార్తీక్.. పోలీసుల అదుపులో ఉన్నాడు. భాస్కర్ రెడ్డి హత్యకు ముందు.. ఆహారంలో కార్తీక్ మత్తు మందు కలిపి ఇచ్చాడనే ఆరోపణలతో అతడిని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు నలుగురు నిందితులు మల్లేశ్, సుధాకర్, కృష్ణం రాజు, ఆర్ఎంపీ వైద్యుడిని పోలీసులు విచారిస్తున్నారు. సీసీ కెమెరా దృశ్యాలు, కాల్ సీడీఆర్ ఆధారంగా ఇతరుల పాత్ర ఎంతమేరకు ఉందనేది దర్యాప్తు చేస్తున్నారు. అదే విధంగా గుప్త నిధులు, రియల్ ఎస్టేట్ గొడవలపైనా ఆరా తీస్తున్నారు.
అసలేం జరిగింది..
నెల్లూరుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి విజయ్ భాస్కర్ రెడ్డి.. గత నెల 20న హత్యకు గురయ్యారు. ఆ రోజు నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ రాగా.. భాస్కర్ రెడ్డి అల్లుడు జయసృజన్ రెడ్డి.. హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు నివాసం ఉన్న హాస్టల్ సమీపంలోని సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేపట్టారు. కారులో భాస్కర్ రెడ్డిని నలుగురు వ్యక్తులు తీసుకెళ్తున్నట్లుగా గుర్తించారు. కారు నంబరు ఆధారంగా మల్లేశ్, సుధాకర్, కృష్ణంరాజుతోపాటు ఆర్ఎంపీ వైద్యుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. విజయ్ భాస్కర్ రెడ్డి హత్య కుట్ర బహిర్గతం చేశారు.