రాష్ట్ర రాజకీయ రంగంలో నెల్లూరుది ప్రత్యేక స్థానం. మాటకారులైన నెల్లూరు నేతలు.. రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. పుచ్చలపల్లి సుందరయ్య.. బెజవాడ గోపాలరెడ్డి వంటి ఉద్దండులతోపాటు.. నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, వెంకయ్యనాయుడు,నేదురుమల్లివంటి పెద్ద నేతలను అందించిన ప్రాంతం ఇది. పెన్నా నది పక్కనే ఉండే ఆ ప్రాంతంలో రాజకీయాలు ఎక్కువే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. నెల్లూరులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రతిపక్ష పార్టీకి అడ్డాగా చెప్పుకునే నెల్లూరు గడ్డపై సైకిల్ పార్టీ సవారీ చేయగలుగుతుందా....?లేక మళ్లీ ఫ్యాన్ గాలే వీస్తుందా అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఒకనాటి కమ్యూనిస్టుల కంచుకోటగా పేరున్న ఈ జిల్లాలో వామపక్షాలు . జనసేనతో కలిసి పోటీ చేయనున్నాయి. వీటి ప్రభావం ఎంత మేరకు ఉంటుంది.. ఎవరి గెలుపును ప్రభావితం చేస్తారన్నది చూడాల్సి ఉంది.
10 అసెంబ్లీ , ఒక పార్లమెంట్ స్థానం ఉన్న నెల్లూరు జిల్లాలో 2014 ఎన్నికల్లో అధికార తెలుగుదేశం కేవలం 3 స్థానాల్లో గెలవగా...వైకాపా 7 స్థానాల్లో విజయభేరి మోగించింది. రెండేళ్ల అనంతరం గూడూరు స్థానం నుంచి గెలిచిన వైకాపా అభ్యర్థి పాశం సునీల్ కుమార్ సైకిల్ ఎక్కారు. ఆయన చేరికతో అధికార పార్టీ బలం నాలుగుకు చేరింది.
కిందటి ఎన్నికల్లో సైకిల్ స్పీడ్ తగ్గినప్పటికి...ఈ ఎన్నికల్లో సత్తా చాటుతామనే ధీమావ్యక్తపరుస్తున్నారు పసుపు పార్టీ నాయకులు. ఆ పార్టీ అధిష్ఠానం ఇచ్చిన ఆదేశాల మేరకు మంత్రి నారాయణ నెల్లూరు నగర నియోజకవర్గంలో పోటీకి సై అనటమే కాదు...ప్రచారాన్ని ప్రారంభించారు. జిల్లాలో ప్రతిపక్ష వైకాపా అభ్యర్థులను ప్రకటించలేదు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలే ప్రచారం సాగిస్తున్నారు.
2014 ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచి వైకాపా తరపున అనిల్ కుమార్ యాదవ్ విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో 6 వేల కోట్లకుపైగా అభివృద్ధి పనులు చేశామని..ఇవే తమ పార్టీని గెలిపిస్తాయని పురపాలక మంత్రి నారాయణ విశ్వాసంతో ఉన్నారు. ఈ స్థానం నుంచి తిరిగి వైకాపా తరపున అనిల్ కుమార్ మళ్లీ పోటీ చేసే అవకాశం ఉంది. కిందటి ఎన్నికల్లో ఫ్యాన్ గాలి వీచిన మరో నియోజకవర్గం సర్వేపల్లి...ఇక్కడి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి గెలిచారు. నియోకవర్గంలో తనకంటూ బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న ఆయన తిరిగి మరోసారి బరిలో ఉండటం దాదాపు ఖాయం. ఇదే స్థానం నుంచి మంత్రి సోమిరెడ్డి పేరు ఖరారు అయినట్లే భావించాలి. ఇప్పటికే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రంగంలోకి దిగారు. ప్రతిపక్ష పార్టీ వైకాపా గెలిచిన నెల్లూరు గ్రామీణంలో ప్రతిపక్ష- అధికార పార్టీల మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా ఉంది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రెండేళ్ల కిందటే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తెదేపా ఇక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరును తెరపైకి తీసుకొచ్చింది. ఆదాలప్రచార జోరు పెంచితెలుగు తమ్ముళ్లులో జోష్ నింపారు..
జిల్లాలో సైకిల్ పార్టీ గెలుచుకున్న కోవూరు నియోజకవర్గంలోనూ అసమ్మతి పోరు కనిపిస్తోంది. ఇక్కడి నుంచి ప్రస్తుతం పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అధిష్ఠానం మళ్లీ ఆయన పేరునే ఖరారు చేసే అవకాశం ఉంది. కానీ మరో తెదేపా నాయకుడు పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి స్వతంత్రగానైనా బరిలోకి దిగుతానని ప్రకటించారు. ఇదే జరిగితే అధికార పార్టీకి నష్టమే. వైకాపా నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఆత్మకూరు స్థానిక ఎమ్మెల్యేగా మేకపాటి గౌతంరెడ్డి వైకాపా నుంచి తిరిగి మరోసారి బరిలో నిలిచే అవకాశాల ఉన్నాయి. కానీ కొంతమేర వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆశించిన మేర అభివృద్ధి జరగలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెదేపా నుంచి బొల్లినేని కిష్టయ్య అభ్యర్థిగా ఖరారైతేవిజయావకాశాలు ఎక్కుువగా ఉంటాయని భావిస్తున్నారు. జిల్లాలో తెదేపా కైవసం చేసుకున్న మరో స్థానం ఉదయగిరి...! ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బొల్లినేని రామారావుకు వచ్చే ఎన్నికల్లో మరోసారి అవకాశం ఇవ్వాలా వద్దా అన్న ఆలోచనలో తెలుగుదేశం ఉంది. ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు దూరంగా ఉంటున్నారనే అపవాదును మూటగట్టుకున్నారు. వైకాపా నుంచి మేకపాటి చంద్రశేఖరరెడ్డి పేరుపరిశీలిస్తోంది. ఇయన అభ్యర్థిత్వం ఖరారైతే ఇరువురి మధ్య పోటీ తీవ్రంగా ఉండబోతుంది. కావలి నియోజవర్గం వైకాపా అభ్యర్ధి, ప్రస్తుత శాసన సభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డినే ఖరారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయనకు సొంత పార్టీలో అసమ్మతి బెడద ఉంది. ఈ మధ్య వైకాపాలో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్థన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి పసుపు కండువా కప్పుకోవటంతో ఫ్యాన్ పార్టీ బలహీనపడింది. తెదేపా అభ్యర్థిగా బీదా మస్తాన్ రావు పేరు ఖరారు అయినట్లే. ఇక్కడ తెదేపా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గూడూరు నియోజకవర్గం నుంచి వైకాపా తరపున గెలిచి..సైకిల్ ఎక్కిన పాశం సునీల్ కుమార్ కు తెదేపా తరపున టికెట్ ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే గ్రూపు రాజకీయాలు కొంత ఇబ్బంది కలిగించేలా కనిపిస్తోంది. వర్గాలను సమన్వయం చేస్తే విజయం సాధించే అవకాశం ఉంది. వైకాపా నుంచి మేరిగ మురళీ పేరు వినబడుతుంది. సంస్థాగతంగా పార్టీ బలంగా లేకపోవటం ఫ్యాన్ పార్టీకి ఇబ్బందిగామారింది. తెదేపా ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గం నుంచి కురుగొండ్ల రామకృష్ణకు మరోసారి టికెట్ ఇచ్చేందుకు అధిష్ఠానం ఆలోచిస్తోంది. బలమైన నాయకుడైనప్పటికి అవినీతి ఆరోపణలు రావటం ప్రతికూల అంశం. ప్రతిపక్ష వైకాపా నుంచి మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి బరిలో దిగే అవకాశం ఉంది. సూళ్లూరుపేటలో 2014 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్య గెలిచారు. వ్యక్తిగతంగా మంచిపేరు ఉండటం కలిస్చోచ్చే అంశం. అధికార పార్టీ తరపున బలమైన అభ్యర్థి లేకపోవటం వైకాపా లాభం చేకూర్చేలా ఉంది. తెదేపాలో ఉన్న నాయకులు మధ్య అనైక్యత పసుపు పార్టీకి లోటుగా మారింది.
నెల్లూరులో మంత్రి నారాయణ చేపట్టిన అభివృద్ధి పనులు.. సోమిరెడ్డి మంత్రిగా బలం పుంజుకోవడం తెలుగుదేశం పార్టీకి కలిసొచ్చే అంశాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పసుపు-కుంకుమ, పింఛన్ల పెంపు, అన్నదాత సుఖీభవ, కాలువల తవ్వకం వంటివి తమకు లాభిస్తాయని.. తెదేపా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ బలం ఏమాత్రం తగ్గలేదు.. మరింత పుంజుకున్నామని ప్రతిపక్ష పార్టీ జోష్‌గా చెబుతోంది. ఓటు పరీక్షకు సిద్ధమైన జనసేన పార్టీ అభ్యర్థులే ఖరారు కాలేదు. ఒకనాడు జిల్లా రాజకీయాలను శాసించామని...తిరిగి పుంజుకుంటామంటామని హస్తం శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఇందులోనే జంప్ జిలానీలు ఎవరీ కొంపముంచబోతారనే భయంఉంది. నెల్లూరు రాజకీయ ముఖచిత్రంపై ఈ సారి ఎవరి ముద్ర పడుతుందో చూడాలి.
"నెల్లూరు నీదా-నాదా" - మంత్రి నారాయణ
రాజకీయం రంజుగా నడిచే.. ప్రాంతాల్లో అదీ ఒకటి... ! ముఖ్యమంత్రులతో సహా.. అత్యున్నత రాజ్యాంగ పదవులను అందుకున్న జిల్లా అది...! అలాంటి నెల్లూరులో ఎన్నికల కూత కూయకముందే రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రతిపక్ష పార్టీ అడ్డా అనుకుంటున్న నెల్లూరు నేలపై జెండా ఎగరేసేదెవరు..ఎవరిసత్తా ఎంత..? రాజకీయ సమీకరణాలు ఏం చెబుతున్నాయి.
నెల్లూరు నేలపై నిలిచేదెవరు..?
ఇవీ కూడా చదవండి:ప్రకాశించేదెవరు..?
Last Updated : Mar 2, 2019, 10:12 AM IST