‘గత ఏడాది మార్చి 23న జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. నామినేషన్లు దాఖలు చేసిన అనంతరం ఎన్నికలను ఎస్‌ఈసీ నిలుపుదల చేసింది. గత ఏడాది మార్చి 9న ఎన్నికల ప్రకటన వచ్చింది. మార్చి 11 నుంచి 13 వరకు నామినేషన్లు స్వీకరించారు. 14న పరిశీలన, 16 వరకు ఉప సంహరణకు అవకాశం ఇచ్చారు. కానీ, 13వ తేదీ సాయంత్రం ఎన్నికలను నిలుపుదల చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. తాజాగా సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో పట్టణాల్లో కోలాహలం మొదలైంది.’
నెల్లూరులో పురపోరుకు రంగం సిద్ధమైంది. ఓ వైపు పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగానే... కరోనా కారణంగా వాయిదా పడిన మున్సిపల్ ఎన్నికలను మార్చి పదో తేదీన నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. గత ఏడాది ప్రక్రియ ఎక్కడ నిలిచిందో.. అక్కడి నుంచే కొనసాగించేలా ఉత్తర్వులు వెలువరించడంతో పట్టణాల్లో కోలాహలం మొదలైంది. అప్పుడే అధికార, ప్రతిపక్ష పార్టీలు రంగంలోకి దిగగా- నామినేషన్ వేసిన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేసే పనిలో ఉన్నారు. ప్రచార రథాలను తిప్పేందుకు పోలీసులకు దరఖాస్తులు చేస్తున్నారు. జిల్లాలో నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు కావలి, గూడూరు, ఆత్మకూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి మున్సిపాలిటీలు, బుచ్చిరెడ్డిపాళెం, అల్లూరు నగర పంచాయతీలు ఉండగా- వీటిలో కేవలం నాలుగు మున్సిపాలిటీల్లో మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. సూళ్లూరుపేట స్థానం జనరల్ కాగా, నాయుడుపేట మున్సిపాలిటీని ఎస్సీలకు కేటాయించారు. వెంకటగిరి బీసీ మహిళకు, ఆత్మకూరు ఎస్టీ జనరల్‌కు రిజర్వు అయింది. ఈ నాలుగు పురపాలికల్లోని 98 వార్డు స్థానాలకు వివిధ రాజకీయ పక్షాల అభ్యర్థులుగా, స్వతంత్రులుగా 568 మంది అప్పట్లో నామినేషన్ వేశారు. వాటిలో 25 తిరస్కరించారు. అనంతరం ఉపసంహరణ దశలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో చాలా స్థానాల్లో అభ్యర్థులు ఎవరనేది తేలలేదు. పలు స్థానాల్లో ఒకే పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు పోటీ చేసేందుకు మొగ్గుచూపుతుండటం స్థానిక నాయకులకు తలనొప్పిగా తయారైంది. మార్చి పదో తేదీ పురపాలక ఎన్నికలు నిర్వహించనుండటంతో గతంలో వేసిన నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు మార్చి మూడో తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు సమయమిచ్చారు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ప్రచార రంగంలోకి దిగారు.