Medical Students Service: వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. వైద్యుడికి సమాజంలో అంతటి ప్రాధాన్యత ఉంది. అయితే వైద్యం పేరుతో దండిగా దండుకుంటారనే పేరు కూడా సమాజంలో ఉంది. ఇలాంటి పేరును పోగొట్టేందుకు నెల్లూరు వైద్య విద్యార్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పేదల కోసం వృత్తిని కొనసాగిస్తామని చెబుతున్నారు. మెడికల్ కళాశాలలో చదువుకుంటూనే సేవ కార్యక్రమాలను చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలలో పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారు.
సాధారణంగా గ్రామాల్లో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారికోసం మేము ఉన్నాం అంటున్నారు.. నెల్లూరు జీజీహెచ్ వైద్య విద్యార్థులు. ఈ మేరకు గ్రామాలలో సర్వేలు చేస్తూ.. వైద్య అవసరాలను గుర్తిస్తున్నారు. 150 మంది వైద్య విద్యార్థులు బృందంగా ఏర్పడి పనిచేస్తున్నారు. కళాశాలలో చదువుతోపాటు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఏపీ జూడో అసొసియేషన్ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో వీరు పనిచేస్తున్నారు.
అందుకోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. 'అందరి ప్రాణాలు కాపాడదాం' అనే నినాదంతో మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. కొవిడ్ తర్వాత గ్రామాల్లో బ్లడ్ డొనేషన్ అంటేనే భయపడుతున్నారు. ఈ విషయంపై ఆ విద్యార్థులు ప్రత్యేక పరిశీలన చేశారు. గ్రామాల్లో కొందరు యువతను తమ బృందంలో చేర్చుకుని వారి ద్వారా గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల కాలంలో బ్లడ్ బ్యాంకుల్లో నిల్వల కొరత ఉంది. ఈ కొరతను భర్తీ చేసేందుకు వైద్య విద్యార్థుల యూనియన్ అనేక ప్రయత్నాలు చేస్తోంది.