ఉపాధ్యాయుడే శాస్త్రవేత్త అయితే... ఇలా ఉంటుంది..! ఉపాధ్యాయుడు నిత్యం విద్యార్థిగా మారాలి. అది పిల్లల మంచి భవిష్యత్‌కు బాటలు వేస్తుంది. క్షేత్రస్థాయిలో ఇలాంటి విద్యను అందిస్తున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన సుబ్రమణ్యం. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన.. ప్రయోగాల ద్వారా పాఠ్యాంశాలను వివరిస్తున్నారు. సొంత నిధులతో ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. తానూ పనిచేసే పాఠశాల విద్యార్థులతోపాటు.. చుట్టుపక్కల ఉన్న పాఠశాలల విద్యార్థులకు ఆయన గురువు.
నెల్లూరు జిల్లా సంగం మండలం తరుణవాయి ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు సుబ్రమణ్యం. ఈయన ఖగోళ శాస్త్రంలోనూ నిష్ణాతుడుగా మారాడు. పేదకుటుంబం నుంచి ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. గాంధీ గిరిజన సంఘం సొంత ఊరు. పేద విద్యార్థులు విద్యలో వెనకబాటుకు కారణం ఏంటని వెతికారు. గ్రామీణ పాఠశాల విద్యార్థికి ప్రయోగాల ద్వారా పాఠ్యాంశాలపై ఆసక్తిని కలిగించాలని ఆలోచించారు. రెండేళ్లు నిరంతరం కష్టపడ్డారు.
కళ్లకు కట్టినట్లు చెప్తారు..!
సొంతగా మైక్రోస్కోప్‌ను తయారు చేశారు సుబ్రమణ్యం. దాని ద్వారా సీతాకోక జీవిత చరిత్రపై బుల్లి చిత్రాన్ని తీశారు. కేవలం విద్యార్థుల కోసమే ఈ ప్రయోగం. నెల్లూరు జిల్లాలో ఉన్న రాకెట్ కేంద్రంలో ప్రయోగాలపై మోడల్స్ తయారు చేశారు. గతంలో చంద్రయాన్-2ప్రయోగం. వాటి ఉపయోగాలను కంటికి కట్టినట్లు నమూనాలు తయారుచేసి చూపిస్తున్నారు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏ విధంగా ఏర్పడుతుంది..? రేఖాంశాలు, అక్ష్యాంశాలు వంటి వాటిని పెద్ద టీవీ ద్వారా కళ్లకు కట్టినట్లు శాస్త్రవేత్తలాగా బోధిస్తున్నారు.
సొంత ఖర్చుతోనే..
తాను చేసిన ప్రయోగాలను విద్యార్థులకు మరింత చేరువ చేసేందుకు సొంత నిధులతో ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. 10లక్షల రూపాయల భవనం నిర్మించారు. మరో 20 లక్షలు ఖర్చు చేసి ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ప్రయోగ పరికరాలను ఏర్పాటు చేశారు. దానికి అబ్దుల్ కలాం గ్రామీణ విద్యార్థుల ప్రయోగశాలగా పేరుపెట్టారు.
ఇలా.. ఖగోళంలోని వింతలను చక్కగా వివరిస్తున్నారు. టెలిస్కోప్ సాయంతో గెలాక్సీని విద్యార్థులకు చూపిస్తున్నారు. ప్రయోగశాలకు వచ్చిన విద్యార్థులకు అర్ధరాత్రివరకూ ఖగోళ శాస్త్రంపై బోధన చేస్తున్నారు. గతేడాది జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈ ప్రయోగశాలను ప్రారంభించారు. సుబ్రమణ్యం కృషిని రాష్ట్రంలోని అనేక మంది శాస్త్రవేత్తలు అభినందిస్తున్నారు. ప్రభుత్వం సాయం చేయాలని.. సుబ్రమణ్యం కోరుతున్నారు.
ఇదీ చదవండి: మోదీకి ఫ్యాన్.. చేశాడు పది వేల ఫొటో కలెక్షన్!