జగనన్న లేఅవుట్ కోసమని... రైతుల నుంచి భూములు సేకరించారు. ఎకరాకు 25 లక్షల పరిహారం ఇస్తామని చెప్పడంతో కష్టాలు తీరుతాయని రైతులు సంబరపడ్డారు. తీరా భూములు తీసుకున్నాక సగం మందికే పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. పరిహారం కోసం ఏడాదిన్నరగా కళ్లుకాయలు చూసేలా ఎదురుచూస్తున్నారు. డబ్బుల కోసం తిరగని కార్యాలయం లేదు. ప్రాథేయపడని అధికారి లేరు. ఎన్ని సార్లు స్పందన కార్యక్రమంలో మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కాక అన్నదాతలు అల్లాడుతున్నారు.
జగనన్న లేఅవుట్ కోసం నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం కొమ్మరపూడిలో ప్రభుత్వం భూసేకరణ జరిపింది. కొత్తూరు బిట్ వన్‌లోని 122 మంది ఎస్సీ రైతుల నుంచి 62 ఎకరాల పొలం తీసుకుంది. ఎకరాకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఈ మాటతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. కష్టాలన్నీ తీరిపోయి జీవితాల్లో వెలుగులు వస్తాయనుకుని సర్కార్‌కు భూములు ముట్టజెప్పారు. అయితే సగం మందికే పరిహారం ఇచ్చి మరొకొందరికి మొండి చేయి చూపింది. ఇప్పటివరకు 60 మందికి పరిహారం చెల్లించగా మిగిలిన 62 మందికి డబ్బులు ఇవ్వలేదు. పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా వారి గోడు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఇలా ఒకటిన్నరేళ్లుగా స్పందన కార్యక్రమంలోపలు మార్లు విన్నవిస్తూనే ఉన్నా అధికారుల నుంచి స్పందన కరవైంది.