Nellore District YCP updates: నెల్లూరు జిల్లాలో వైసీపీ బీటలు వారుతోంది. పార్టీకి కంచుకోటలాంటి నెల్లూరులో ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధిష్ఠానం తీరును దుయ్యబడుతున్న నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీనీ వీడనున్నట్టు తెలిసింది. దీంతో కోటంరెడ్డి తీరుపై అధిష్ఠానం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. గత 3 నెలలుగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉండడంతో అధిష్ఠానం.. తాజాగా గన్‌మెన్లను తొలగించి, ఆయనను నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తప్పించి కొత్తవారిని నియమించింది. ఈ క్రమంలో కోటంరెడ్డి పార్టీని వీడేందుకు సన్నద్ధ సమావేశాలను నిర్వహిస్తుండడం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ సమన్వయకర్తగా వైసీపీ రాష్ట్ర సేవా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కోటంరెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డిని నియమించాలని పార్టీలో చర్చ జరిగింది. పార్టీ పరిశీలనలో ఆనం విజయ్‌కుమార్ రెడ్డి పేరు కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించే విషయంలో అధిష్ఠానం ఇప్పటికే సిద్ధమైనట్టు సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుత వైసీపీ గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి గ్రామీణ వైసీపీ కార్యాలయంలో ప్రధాన అనుచరులతో, పార్టీ కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై మంతనాలు జరిపారు.
సమావేశంలో భాగంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తన రాజకీయ పరిస్థితులపై అధిష్టానం నిఘా వేసిందని, ఫోన్ ట్యాపింగ్ చేసిందని తీవ్రంగా ఆగ్రహించారు. వైసీపీనీ వీడి టీడీపీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తన నిర్ణయాన్ని బయటపెట్టారు. అధిష్టానం కూడా ఆయన ప్రాధాన్యతను తగ్గించేందుకు నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్తను నియమించేందుకు ఏర్పాట్లు చేస్తుందని.. ఈ పరిస్థితుల్లో కోటంరెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉందని ఆయన ప్రధాన అనుచరులు పేర్కొన్నారు.