JUDGEMENT ON MURDER CASE IN NELLORE : నెల్లూరు హాస్పిటల్ అధినేత డాక్టర్ విజయ్ కుమార్ హత్య కేసులో నెల్లూరు జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐదుగురి నిందితులకు జీవిత ఖైదుతో పాటు రూ.5వేల జరిమానా విధించింది. ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జ్ సత్యవాణి తీర్పు చెప్పారు. 2015 మే28 జరిగిన ఈ హత్యలో భార్య, కుమారుడితో పాటు మరో ముగ్గురిని హంతకులుగా పోలీసులు తేల్చారు. భార్యాభర్తల మధ్య వివాదంతో పాటు ఆస్తి తగాదాలే హత్యకు కారణమని నిర్ధారించారు. ఈ హత్య అప్పట్లో రాష్ట్రంలో సంచలనం కలిగించింది.
జన విజ్ఞాన వేదిక, ప్రజా సంఘాల నాయకుడు డాక్టర్ జి విజయ్ కుమార్ హత్య కేసులో ఒకటవ అదనపు సివిల్ జడ్జి కోర్టు ఈ రోజు సంచలన తీర్పు జిల్లా ప్రజలకు ఆ హత్య మళ్లీ గుర్తుకు వచ్చేలా చేసింది. విజయ్ కుమార్తో విడాకులు పొందిన ఆయన భార్య ఉషారాణి, కుమారుడు సుందరయ్య,.. ఉషారాణితో సహజీవనం చేస్తున్న న్యాయవాది శ్రీధర్, మరో ఇద్దరు కిరాయి హంతకులకు యావజ్జీవ కారాగార శిక్ష, 5000 రూపాయలు జరిమానా విధిస్తూ..జడ్జి సత్యవాణి తీర్పు చెప్పారు.
అసలేం జరిగింది:జన విజ్ఞాన వేదిక, ప్రజా సంఘాల నాయకుడు డాక్టర్ విజయ్ కుమార్ హత్య రాష్ట్రంలోనే సంచలనం కలిగించింది. 2015 మే 28న కుమార్ను తన నివాసంలోనే అతని కుమారుడు సుందరయ్య, విడాకులు పొందిన భార్య ఉషారాణి.. ఆమెతో సహజీవనం చేస్తున్న న్యాయవాది శ్రీధర్లు కలిసి హత్య చేశారు. ఆపై గుండెపోటుతో మరణించినట్లు నాటకం ఆడారు. అయితే అతని మృతిని నమ్మని ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. డాక్టర్ విజయకుమార్ స్నేహితుడు.. న్యాయవాది కేవీ శేషారెడ్డి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే విజయ్ కుమార్ రెడ్డి మృతదేహాన్ని ఖననం చేసేందుకు భార్య, కుమారుడు, హత్య నేరంతో సంబంధం కలిగిన మరో ఇద్దరు ప్రయత్నం చేశారు. దీనిని ప్రజాసంఘాల నాయకులు అడ్డుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన 5వ పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు.