ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేసులు వారివి.. కాసులు వీరికి.. వసూళ్ల దందా చేస్తున్న పోలీసులు! - నెల్లూరు జిల్లా పోలీసుల వసూళ్ల దందా

నెల్లూరు జిల్లాలో పోలీసులు వసూళ్ల దందా సాగిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అనధికార మద్యం, ఇసుక రవాణాలపై సెబ్ అధికారులు ఉక్కుపాదం మోపుతుంటే.. పోలీసులు వాటిని సొమ్ము చేసుకుంటున్నారు. స్టేషన్ బెయిల్ పేరుతో వసూళ్లు చేస్తున్నారు.

nellore district police collected station bail cash from illegal sand transport owners
నెల్లూరు జిల్లా పోలీసుల వసూళ్లు

By

Published : Jul 4, 2020, 9:24 AM IST

నెల్లూరు నగరంలోని ఓ ప్రాంతంలో అనధికారికంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని సమాచారం అందుకున్న స్పెషల్‌ ఎన్‌ఫోర్స్​మెంట్‌ బ్యూరో అధికారులు దాడులు చేశారు. ట్రాక్టరు, డ్రైవరును అదుపులోకి తీసుకొని సంబంధిత పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. కేసు నమోదు చేశారు. స్టేషనుకు వెళ్లడం ఏంటని ఆ యజమాని ఎంత డబ్బయినా సరే.. స్టేషన్‌ బెయిల్‌ తీసుకునేందుకు ఉత్సాహం చూపాడు. దీన్ని గ్రహించిన ఓ కానిస్టేబుల్‌ రంగంలోకి దిగి ఆఘమేఘాల మీద తంతును ముగించి ఉన్నతాధికారి నుంచి బెయిల్‌ మంజూరు చేయించారు.

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనధికార మద్యం, ఇసుక రవాణాలపై సెబ్‌ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిత్యం ఏదొక ప్రాంతంలో దాడులు చేసి నిందితులపై కేసులు నమోదు చేస్తున్నారు. లిక్కర్‌పై సెబ్‌ అధికారులే కేసులు నమోదు చేస్తుండగా.. ఇసుకపై మాత్రం సంబంధిత పోలీసుస్టేషన్‌ అధికారులకు అప్పగిస్తున్నారు.

అయితే స్టేషన్‌ బెయిల్‌ పేరుతో ప్రసుత్తం జిల్లాలో కొత్త తరహా దోపిడీ జరుగుతోంది.. ఓ వైపు సెబ్‌ అధికారులు దాడులు చేస్తుంటే.. మరోవైపు పోలీసులు బెయిల్‌ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన సెబ్‌ దాడులు.. పోలీసులకు కల్పతరువుగా మారాయి. వాహనాల యజమానులు పోలీసుస్టేషనులో తీసుకొనే బెయిల్‌కు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు వసూళ్లు చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ)ను ఏర్పాటు చేసింది. అనధికార మద్యం, ఇసుక తరలింపులపై దాడులు చేస్తున్నా.. కేవలం మద్యంపైనే కేసులు నమోదు చేసే అధికారమిచ్చారు. ఇసుక అక్రమ రవాణా కేసులను మాత్రం సంబంధిత పోలీసు స్టేషన్లకు అప్పగించేలా ఆదేశాలున్నాయి. సెబ్‌ అధికారులు దాడులు చేసి పట్టుకున్న వాహనం, ఇసుకను సంబంధిత పోలీసు స్టేషన్‌కు అందజేస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న కొంతమంది పోలీసులు చక్రం తిప్పుతున్నారు. నిబంధనల ప్రకారం నాన్‌ గ్రేవ్‌ కేసుల్లో బెయిల్‌ ఇచ్చేందుకు స్టేషన్‌ హౌస్‌ అధికారి (ఎస్‌హెచ్‌వో)కు అధికారం ఉంది. అంటే ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులకు సంబంధిత ఎస్సైగానీ, సీఐగానీ ఎవరైతే ఎస్‌హెచ్‌వోగా ఉంటారే వారే స్వయంగా బెయిల్‌ ఇవ్వొచ్చు. దీన్నే అవకాశంగా మలచుకొని ట్రాక్టరుకు ఒక రేటు.. టిప్పర్‌కు మరో రేటు నిర్ణయించి అందిన కాడికి దోచుకుంటున్నారు.

కానిస్టేబుళ్లు కూడా..

ఇసుక తనిఖీలు జరిగాయంటే చాలు.. సంబంధిత స్టేషన్‌ కానిస్టేబుళ్లు సిద్ధమవుతున్నారు. వాహన యజమానులు స్టేషన్‌కు వస్తే బెయిల్‌ కోసం ఏఏ పత్రాలు కావాలో నిమిషాల్లో చెప్పేస్తూ మొత్తం పనులన్నీ వాళ్లే చక్కబెట్టేస్తున్నారు. తతంగమంతా అయ్యాక ఒక పెద్ద నోటును తీసుకుంటున్నారు.

త్వరలో మాకు అధికారాలు రానున్నాయి

'అనధికారికంగా ఇసుక రవాణా జరిగినా, నిల్వలు ఉంచినా దాడులు చేసి బాధ్యులను పోలీసుస్టేషన్‌లో అప్పగిస్తున్నాం. అన్ని వివరాలు నమోదు చేసి సెబ్‌ ముద్రతో కూడిన దస్త్రాన్ని స్టేషన్‌లో ఇస్తున్నాం. ఎలాంటి కేసులు రాయాలనేది మా పరిధిలో లేదు. త్వరలో కేసులు నమోదు చేసే అధికారం సెబ్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయి.' - రాధయ్య, డిప్యూటీ కమిషనర్‌, సెబ్‌

ఇవీ చదవండి..

పోలీసు శాఖలో ఈ-బీట్‌.. పారదర్శకంగా పహారా

ABOUT THE AUTHOR

...view details