నెల్లూరు జిల్లా కొండాపురం మండలం చింతలదేవిలో జాతీయ స్థాయి కామథేను ప్రాజెక్టు ఉంది. అందులో దేశంలోని అనేక రాష్ట్రాల చెందిన పశు జాతులను పెంచుతున్నారు. ఈ ప్రాజెక్టుకు పక్కనే ఉన్న మిశ్రమ పశుగణాభివృద్ధి క్షేత్రంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఈ క్షేత్రంలో పశువులకు బ్రుసెల్లోసిస్, ఐబీఆర్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. నాలుగేళ్లుగా ఇక్కడ పశువులు రోగంతో బాధపడుతున్నాయి. రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేశారు. అధికారులు వీటిని దాచిపెట్టారు. నాలుగేళ్లలో మృతి చెందిన పశువులను రహస్యంగా పూడ్చివేసిన పరిస్థితులు క్షేత్రంలో ఉన్నాయి.
నిజం దాస్తున్నారు...గుట్టుగా అమ్మేస్తున్నారు!
చింతలదేవి పశు గణాభివృద్ది క్షేత్రంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడుతోంది. అనారోగ్యానికి గురైన పశువులకు వైద్య సేవలు అందించకుండా.. వాటినే రైతులకు విక్రయిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని పశువులకు ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటుండగా మన రాష్ట్రంలో పట్టించుకోవట్లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
విజయవాడ నుంచి వచ్చిన అధికారులు ఇటీవల రక్త నమూనాలు సేకరించారు. క్షేత్రంలోని సగానికిపైగా పశువులకు బ్రుసెల్లోసిస్, ఐబీఆర్ వంటి వ్యాధులు ఉన్నట్లు నివేదికలు వచ్చాయి. ఈ విషయం క్షేత్రంలో ఉన్నఅధికారులకు తెలిసినా బహిర్గతం చేయకుండా నాలుగేళ్లుగా రైతులకు పశువులను వేలంలో విక్రయిస్తున్నారు. ఈ వ్యాధులు ఉన్న పశువులను రైతులు కొనుగోలు చేస్తే... వారి గ్రామాల్లోని పశువులకు ఈ వ్యాధులు వస్తాయి. ఒక్కసారి వ్యాధి వస్తే పశువు కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. వ్యాధి తగ్గిన తరువాత వేలం నిర్వహించాల్సి ఉండగా.. అధికారులు పట్టించుకోకుండా అడ్డగోలుగా అనేక గ్రామాలకు విక్రయించారు. మూడేళ్ల కిందట కర్ణాటకలో ఈ వ్యాధి బయటపడినప్పుడు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ పరిస్థితి మన రాష్ట్రంలోనూ నెలకొంది. చింతలదేవి మిశ్రమ పశుగణణాభివృద్ధి క్షేత్రంలో నాలుగేళ్లుగా ఉన్న వ్యాధుల పరిస్థితులపై లోతుగా విచారణ జరుగుతున్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి:పోర్టల్లో పోలవరం టెండర్ వివరాలు