Kandukuru incident inquiry has been postponed: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 'ఇదేం ఖర్మ- మన రాష్ట్రానికి' కార్యక్రమంలో భాగంగా గత సంవత్సరం డిసెంబర్ 28వ తేదీన నెల్లూరు జిల్లా కందుకూరులో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఆ సభకు వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు తరలిరాగా.. తొక్కిసలాట జరిగి, దురదృష్టవశాత్తూ టీడీపీకి చెందిన 8మంది కార్యకర్తలు మృతి చెందారు. ఆ ఘటనకు సంబంధించి..రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శేషశయనారెడ్డి నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
ఈ క్రమంలో కందుకూరు టీడీపీ నేతలు నేడు విచారణకు హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు విచారణ కొనసాగిందని నేతలు మీడియాకు తెలిపారు. అనుమతి తీసుకున్న దానికంటే ఎక్కువ ఫ్లెక్సీలు ఎందుకట్టారన్న అంశంపై కమిషన్.. విచారణ చేసినట్లు నేతలు తెలిపారు. మళ్లీ 15వ తేదీన విచారణకు రావాల్సిందిగా ఏకసభ్య కమిషన్ ఆదేశించిందన్నారు. కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటించి.. సేకరించిన వివరాలపై మమ్మల్ని విచారించారని తెలుగుదేశం నేత ఇంటూరు రాజేష్ వెల్లడించారు.
అనంతరం కమిషన్ దృష్టిలో ఉన్న వివరాల కాపీలు మీ దగ్గరున్నాయా అని కమిషన్ అడిగిందన్నారు. తమ వద్ద సమాచారం లేనందున..కొంత సమయం ఇవ్వాలని అడిగామన్నారు. వారి వద్ద ఉన్న సమాచారాన్ని ఇవ్వడానికి కమిషన్ అంగీకరించిందన్నారు. దీంతో 15వ తేదీ వరకు సమయం కావాలని, ఆరోజు వరకు వాయిదా వేయాలని అడగగా.. అందుకు కమిషన్ అంగీకరించిందన్నారు. ఎవరి వద్ద వివరాలు సేకరించిందో.. వాళ్లు ఎక్కడివాళ్లో తాము పరిశీలించాల్సి ఉందని మరో నేత ఇంటూరు నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. కమిషన్‌కు అభిప్రాయాలు ఎవరు చెప్పారో నిర్ధారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వీటికి సమయం అవసరం.. అందుకే సమయం అడిగామని వెల్లడించారు.