ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో ఏలూరు తరహా ఘటన...అస్వస్థతతో వలస కూలీ మృతి

నెల్లూరులో విషాదం
నెల్లూరులో విషాదం

By

Published : Dec 12, 2020, 1:06 PM IST

Updated : Dec 13, 2020, 5:08 AM IST

13:03 December 12

నెల్లూరు జిల్లాలో విషాదం

నెల్లూరులో విషాదం

ఏలూరులో వింతవ్యాధిని మరువక ముందే నెల్లూరు జిల్లాలో వలస కూలీలు అస్వస్థతకు గురవడం కలకలం రేపుతోంది. ఒకరు మృతి చెందగా, 9 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పశ్చిమబంగా రాష్ట్రానికి చెందిన 53 మంది వలస కూలీలు ఇటీవల నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెరుబొట్లపల్లికి వరినాట్ల కోసం వచ్చారు. మొత్తం 53 మంది రెండు బృందాలుగా వచ్చినట్లు సమాచారం. వీరిలో ముగ్గురు శుక్రవారం వాంతులు, విరేచనాలతో జీజీహెచ్‌లో చేరారు. శనివారం మరో 7 మందికీ ఇదే సమస్య తలెత్తింది. గోవింద్‌ ముండా (47) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ఆరుగురిని తొలుత పొదలకూరుకు, తర్వాత నెల్లూరు జీజీహెచ్‌కు తీసుకువచ్చారు. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం సాయంత్రం అన్నం, కోడిగుడ్డు, బంగాళాదుంపతో తయారుచేసిన ఆహారాన్ని తిన్నట్లు బాధితులు చెబుతున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే అస్వస్థతకు గురయ్యారు. గోవింద్‌ ముండా మృతదేహాన్ని శవపరీక్ష కోసం జీజీహెచ్‌కు తరలించారు. కలెక్టర్‌ చక్రధర్‌బాబు జీజీహెచ్‌కు చేరుకుని వైద్య సేవలను పరిశీలించారు.

ప్రత్యేక బృందాల ఏర్పాటు
వైద్య, ఆరోగ్యశాఖ, జీజీహెచ్‌ వైద్యులు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అస్వస్థతకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు కూలీలు తాగిన బోరు నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. జీజీహెచ్‌ వైద్యులు వాంతులు, విరేచనాల నమూనాలను పరీక్షల నిమిత్తం పంపారు. జిల్లా జేసీ హరేందిర ప్రసాద్‌, డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి  పరిస్థితిని పరిశీలించారు. మిగిలిన కూలీలకు లక్షణాలు లేకపోయినా ముందు జాగ్రత్తగా జీజీహెచ్‌కు తరలించి.. పర్యవేక్షణలో ఉంచారు. కొందరు కూలీలు బస చేసిన గదికి ఆనుకుని పురుగుమందులు నిల్వ చేయడంతో.. ఆ కోణంలోనూ అధికారుల విచారణ సాగుతోంది. ఈ విషయమై డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి ‘ఈనాడు’తో మాట్లాడుతూ.. నమూనాలను పరీక్షల నిమిత్తం పంపామని, ఆ ఫలితాలు వచ్చాకే కారణాలపై స్పష్టత వస్తుందని తెలిపారు. చనిపోయిన వ్యక్తికి దీర్ఘకాలిక వ్యాధులు ఉండటంతో పరిస్థితి విషమించినట్లు వివరించారు.

ఇదీ చదవండి:

పేకాట కోసం 50 ఎకరాలు అమ్మాడు.. చివరికి దొంగగా మారాడు!

Last Updated : Dec 13, 2020, 5:08 AM IST

ABOUT THE AUTHOR

...view details