SUMOTO ENQUIRY: వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిందితుడిగా ఉన్న కేసు ఆధారాలు నెల్లూరు కోర్టు నుంచి చోరీకి గురైన ఘటనపై హైకోర్టు సుమోటో పిల్‌పై విచారణ జరిపి 18 మంది ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. కోర్టులో ఆధారాల చోరీ కేసు మాత్రమే కాకుండా.. కాకాణి గోవర్ధన్‌రెడ్డి, తదితరులపై నెల్లూరు కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఫోర్జరీ కేసునూ సీబీఐకి ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని ప్రతివాదులను ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, సీబీఐ డైరెక్టర్, నెల్లూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, చిన్నబజారు ఠాణా ఎస్‌హెచ్‌వో, నెల్లూరు గ్రామీణ ఠాణా ఎస్‌హెచ్‌వో, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్), నెల్లూరు జిల్లా జడ్జి (పీడీజే), నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి, విజయవాడలోని ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పసుపులేటి చిరంజీవి, టి.వెంకటకృష్ణ, జి.హరిహరన్, ఫిర్యాది (న్యాయస్థానంలో జూనియర్ అసిస్టెంట్) బి.నాగేశ్వరరావుకు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది.
నెల్లూరు కోర్టులో చోరీ కేసు.. మంత్రి కాకాణి, డీజీపికి నోటీసులు
11:01 April 26
తదుపరి విచారణ మే 6కి వాయిదా
వాస్తవాలు బయటకు రావాలంటే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు అవసరమని నెల్లూరు పీడీజే హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో కోరారని ఈ సందర్భంగా గుర్తుచేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ.. కోర్టులో చోరీ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడంపై రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరం లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఆ విషయాన్ని అఫిడవిట్ రూపంలో చెప్పాలని సూచించింది. చోరీ కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుముందు ఉంచాలని డీజీపీని ఆదేశించింది.
ఇదీ చదవండి: తిరుపతిలో అమానవీయం..మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్న అంబులెన్స్ సిబ్బంది