Kotamreddy Srinivasula Reddy had a car accident: నెల్లూరు నగర తెలుగుదేశం ఇన్‌ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు కారుతో ఢీకొట్టి పరారైన ఘటన సంచలనం సృష్టించింది. బాలాజీనగర్‌లోని కోటం రెడ్డి ఇంటివద్ద ఈ ఘటన జరిగింది. కోటంరెడ్డి కుమారుడు ప్రజయ్ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు రాజశేఖర్ రెడ్డి స్నేహితుడు. రాజశేఖర్‌రెడ్డి శనివారం తాగి తమ ఇంటికి వచ్చి గొడవకు దిగాడని.. కోటంరెడ్డి బంధువులు తెలిపారు. రాజశేఖర్ రెడ్డికి సర్దిచెప్పి వదిలి వెళ్లేందుకు శ్రీనివాసుల రెడ్డి బయటకు వచ్చారని కారులో ఎక్కిన రాజశేఖర్ రెడ్డి వేగంగా కారుతో ఆయన్ని ఢీకొట్టి పరారయ్యాడని చెప్పారు. రోడ్డుపై పడిపోయిన శ్రీనివాసులరెడ్డిని వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. కాలుకు తీవ్ర గాయమైందని.. వైద్యులు చికిత్స చేస్తున్నారని కుటుంబీకులు వెల్లడించారు.
కోటంరెడ్డి ఇంటి వద్ద సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తే కావాలనే కారుతో ఢీకొట్టి పరారైనట్లు అర్థమవుతుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోటంరెడ్డిని పరామర్శించిన ఆయన..ఘటనను తీవ్రంగా ఖండించారు. నెల్లూరులో యువత మత్తుకు బానిసవుతున్నారని..ఇంటికి వచ్చి రాజశేఖర్‌రెడ్డి గొడవకు దిగడం డ్రగ్స్ ప్రభావమేనని అనుమానం వ్యక్తం చేశారు.