Negligence on Sanitation Works: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయితీలో 50వేల జనాభా నివసిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పంచాయతీలో ఒకప్పుడు సాగునీటిని అందించిన పంట కాలువలు నేడు మురుగు కాలువలుగా దర్శనమిస్తున్నాయి. పంచాయతీ పరిధిలో కనిగిరి రిజర్వాయర్ నుంచి వచ్చే రేబాల కాలువ నాలుగు కిలోమీటర్లు ఉంటుంది. మరొకటి గుడిపల్లి కాలువ మూడు కిలోమీటర్లు ఉంటుంది. బుచ్చిరెడ్డిపాలెం చుట్టూ ఈ పంటకాలువలు విస్తరించి ఉంటాయి.
స్వచ్ఛంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచాల్సిన ఈ పంటకాలువలు మురుగు కూపాలుగా మారాయి. ఇళ్ల మధ్యనుంచి వెళ్తున్న కాలువల్లో పారుదల లేక దుర్వాసన వ్యాపిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నాలుగేళ్లపాలనలో పారిశుద్ధ్య పనులపై నిర్లక్ష్యం చేయటంతో మురుగుకాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోయి వ్యర్థాలతో నిండిపోయాయని స్థానికులు చెబుతున్నారు.
పారిశుద్ధ్య పనులు పట్టించుకోని అధికారులు.. కార్మికుడిగా మారిన వార్డు కౌన్సిలర్
కాలనీవాసులకు తరచూ జ్వరాలు వస్తున్నాయని.. ఇళ్ల ముందే కాలువల్లో మురుగు నిలిచి ఉండటంతో దుర్వాసన వస్తోందని తెలిపారు. మేజర్ పంచాయతీ అయినా చెత్తాచెదారం తొలగించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. శాంతినగర్, అలిపురం వైపు నుంచి వచ్చే కాలువల్లో నీరు పూర్తిగా నిలిచిపోయింది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు, బస్టాండ్ వద్ద మురుగు నిలబడిపోయింది. రెండు కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పడంతో గుత్తేదారులు కాలువలు పంచుకుని పనులు ప్రారంభించారు. బిల్లులు రాకపోవడంతో మధ్యలోనే పనులను నిలిపివేశారు. ఇప్పటికైనా నగరంలో పారిశుద్ధ్య పనులు చేపట్టి అనారోగ్యాల బారి నుంచి రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.