Lokeshs Interact With BCs టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదివారం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని బంగారుపాళ్యంలో బీసీలతో నారా లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. బీసీల సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్న ఆయన కార్పొరేషన్లలో కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. బీసీ కార్పొరేషన్లకు నిధులిచ్చి ఉప కులాలన్నింటికీ న్యాయం చేస్తామని నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. టీడీపీ పాలనలో బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత, పథకాలను వివరించారు.
బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం :వైసీపీ ప్రభుత్వం హయంలో బీసీలకు తగిన ప్రోత్సాహం కరవై ఇబ్బందులు పడుతున్నామని, తమ అభివృద్ధి తోడ్పడే పథకాలు లేకుండా చేశారని పలువురు బీసీలు.. లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. తమపైనే దాడులు చేసి, ఎదురు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ గెలిచిన మొదటి సంవత్సరంలోనే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తామని లోకేశ్ వారికి హామీ ఇచ్చారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే బీసీలను అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అమరనాథ్ గౌడ్ లాంటి హత్య ఘటనలు జరగకుండా చూస్తామని ఆయన అన్నారు. వైసీపీ తీసేసిన గోపాల మిత్రల వ్యవస్థను మళ్లీ తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. అవసరమైన చోట రజకుల కోసం ధోబీఘాట్‌లను కడతామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తగ్గించిన 10 శాతం రిజర్వేషన్లను తిరిగి పునరుద్ధరిస్తామని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్క కి.మీ. రోడ్డు వేశారా.. డ్రెయిన్ వేశారా అని నారా లోకేశ్ ప్రశ్నించారు.