అనాథ శవం అంటే అమ్మో అని పక్కకు తప్పుకొనేవాళ్ల గురించి తెలుసు. కానీ వాళ్లకి అన్నీతామై అంతిమ సంస్కారాలు చేస్తామని ముందుకొచ్చేవాళ్ల గురించి తెలుసా? నెల్లూరుకు చెందిన మునిరత్నమ్మ ఆమె కుమార్తె పరిమళ పదమూడేళ్లుగా ఇదే పనిలో ఉన్నారు. బి.ఎల్. మొదటి సంవత్సరం చదువుతోన్న పరిమళ ఏమాత్రం సంకోచం లేకుండా చనిపోయిన వారికి వారి సంప్రదాయం ప్రకారం తల్లితో కలిసి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుంది. కొందరి మత విశ్వాసం మేరకు తానే స్వయంగా తలకొరివి పెడుతుంది. మునిరత్నమ్మ స్థానిక విద్యుత్తు కార్యాలయంలో గుమాస్తా. ఆమె భర్త విద్యుత్తు ఉద్యోగిగా పని చేస్తూ మృతి చెందడంతో ఆమెకా ఉద్యోగం ఇచ్చారు.
ఓ వైపు ఉద్యోగం చేస్తూనే ఒంటరి మహిళలు, అనాథల కష్టాలని అర్థం చేసుకున్న మునిరత్నమ్మ 2007లోనే జీసస్ ఫౌండేషన్ పేరుతో ఒక ఆశ్రమాన్ని స్థాపించింది. అక్కడ ఆశ్రయం పొందుతున్న వాళ్లలో రిటైర్ అయిన ఇంజినీర్ కూడా ఉన్నారు. ఆయనకు రెండు కళ్లూ లేవు. ఏడెనిమిది ఏళ్లుగా ఆశ్రమం పొందిన ఆయన మునిరత్నమ్మను కోరిన చివరి కోరిక.. ఆమే తనకి స్వయంగా తలకొరివి పెట్టాలని. అనాథ శవాలకు తలకొరివి పెట్టే బృహత్‌కార్యం అలా మొదలైంది. ఆ చుట్టుపక్కల ఏ ఊళ్లో అయినా అనాథ మృతదేహం ఉందని తెలిస్తే చాలు తల్లీకూతుళ్లు స్కూటీపై అక్కడకు చేరుకుని తమ సొంత నిధులతో అంత్యక్రియలు పూర్తిచేస్తున్నారు. ఇంతవరకూ 40 మందికి అంత్యక్రియలు నిర్వహించారు.
అమ్మతో కలిసి అడుగులు...