kotamreddy giridhar reddy : వైఎస్సార్సీపీ తిరుగుబాటు నేత, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి టీడీపీలో చేరనున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని.. ఈ కార్యక్రమానికి అభిమానులు, కార్యకర్తలతో పాటు అందరూ తరలివచ్చి ఆశీర్వదించి మద్దతు తెలపాలని కోరారు. గిరిధర్ రెడ్డి చేరిక నేపధ్యంలో నెల్లూరు జిల్లాలో సందడి నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నారా లోకేష్ చిత్రాలున్న ఫ్లెక్సీలను నగరమంతా ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం నెల్లూరులో భారీ ప్రదర్శన నిర్వహించిన అనంతరం మంగళగిరికి తరలివెళ్లేలా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు పార్టీ కండువాలు కప్పుకోనున్నారు. చేరికల సందర్భంగా పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడంతో పాటు.. భారీ సంఖ్యలో వాహనాల ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గతంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన గిరిధర్‌రెడ్డి.. ఆయన సోదరుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో పాటు కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు.
కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నే టీడీపీలో చేరుతున్న నేపధ్యంలో నెల్లూరు నగరం పసుపుమయంగా మారింది. భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మాగుంట లేఅవుట్ లోని గిరిధర్ రెడ్డి కార్యాలయానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం నెల్లూరు నగరంలోని కస్తూరిదేవి గార్డెన్స్ నుంచి కరెంట్ ఆఫీసు సెంటర్, అయ్యప్పగుడి వరకు భారీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం అభివృద్ధి కోసమే టీడీపీలో చేరుతున్నట్లు నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
నెల్లూరులోని కస్తూరిదేవి గార్డెన్ నుంచి మంగళగిరిలో ఉన్న టీడీపీ రాష్ట్ర కార్యాలయం వరకు భారీగా కార్ల ర్యాలీతో బయల్దేరి.. అక్కడ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చేరడానికి నెల్లూరు నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధే మా లక్ష్యం. ఆ కారణం వల్లనే వైఎస్సార్సీపీకి దూరమయ్యాం. పెండింగ్ పనులన్ని పూర్తి చేయడానికి మేమంతా శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తాం. - కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి