Kotamreddy Sridhar Reddy Comments about House Arrest: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తాను లేవనెత్తిన ప్రజా సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం ఆగబోదని.. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టంచేశారు. సమస్యల పరిష్కారం కోసం జలదీక్షకు దిగిన తనను పోలీసులు అన్యాయంగా గహనిర్బంధం చేశారని విమర్శించారు. నిధులు మంజూరు చేస్తూ సీఎం జగన్ చేసిన సంతకానికే దిక్కులేకపోతే ఎలా అని శ్రీధర్‌రెడ్డి అంటున్నారు.
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం పరిధిలో అనేక ప్రజా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని.. స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. మూడున్నరేళ్లుగా వాటిని పరిష్కరించాలని.. కలెక్టర్ నుంచి సీఎం వరకు అందరినీ కలిసినా ప్రయోజనం శూన్యమని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడానికే జలదీక్ష రూపంలో ఆందోళనకు దిగానని.. కానీ శాంతియుత నిరసనను గృహనిర్బంధంతో అడ్డుకోవడం సరికాదని కోటంరెడ్డి సూచించారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ తన పోరాటం ఆగబోదని స్పష్టంచేశారు. శ్రీధర్‌రెడ్డికి స్థానిక నేతలతో పాటు వామపక్ష, జనసేన నేతలు మద్దతు తెలిపారు. ప్రభుత్వం అణచివేతను మానుకుని శ్రీధర్‌రెడ్డి లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
హౌస్ అరెస్ట్: కాగా జలదీక్షకు పిలుపునిచ్చిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మాగుంట లేఅవుట్లో పోలీసులు ఈ రోజు ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. తెల్లవారు జామున 5 గంటలకు పెద్ద ఎత్తున పోలీసులు ఇంటిని మోహరించారు. నెల్లూరు గ్రామీణంలోని పొట్టెపాలెం వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలని, మునుముడి కలుజు వద్ద వంతెన నిర్మాణం కోసం.. పొట్టెపాలెం కలుజువద్ద 8 గంటలకు నీళ్లలో కూర్చుని దీక్షకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి జలదీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఆయనను ముందస్తుగా గృహనిర్బంధం చేశారు. మాగుంట లేఔట్‌లోని ఎమ్మెల్యే కోటంరెడ్డి నివాసం వద్దకు కోటంరెడ్డి అభిమానులు, నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
ఆగ్రహం వ్యక్తం చేసిన కోటంరెడ్డి: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని గృహనిర్బంధం చేయడంతో.. ఆయన ఇంటి వద్దే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. దీంతో కోటంరెడ్డి ఇంటివద్దకు పెద్దఎత్తున కార్యకర్తలు, అనుచరులు తరలి వస్తున్నారు. పోలీసులు అనుమతి ఇచ్చేంతవరకూ ఇక్కడే కూర్చుంటానని కోటంరెడ్డి స్పష్టం చేశారు. పోలీసులు ఎంతసేపు కాపలా ఉంటారని ప్రశ్నించారు. పది రోజుల ముందు నుంచే పోలీసులను అనుమతి కోరుతున్నానని.. అయినా సరే తెల్లవారు జామున వచ్చి దీక్షకు అనుమతి లేదన్నారని కోటంరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఎంతమంది పాల్గొంటారు, గజ ఈత గాళ్లు ఉన్నారా వంటి ప్రశ్నలు అడిగారని కోటంరెడ్డి అన్నారు.