నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి MLA Kotam Reddy Sridhar Reddy: తనపై కక్షసాధింపు చర్యలలో భాగంగా.. నన్ను మానసికంగా హింసించేందుకే ప్రభుత్వం నాకు భద్రత తగ్గించిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్న సందర్భంలో ఇద్దరు గన్‌మెన్లను తొలగించటమేంటని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం నాకు 2 + 2 భద్రత కల్పించిందని ఆయన తెలిపారు. శనివారం ఇద్దరు గన్‌మెన్లను తొలగించారు. ఎవరి ఆదేశాలతో గన్‌మెన్లను తొలగించారని.. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పనిదే ఈ పని చేయరని విమర్శించారు.
ప్రస్తుతం ఇద్దరు గన్‌మెన్లను తొలగించిందని వివరించారు. ప్రభుత్వం ఇద్దరు గన్‌మెన్లను తొలగించగా.. మిగతా ఇద్దరి గన్‌మెన్లను నేను ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానని అన్నారు. ఇద్దరు గన్‌మెన్లను తొలగిస్తే నేను భయపడనని.. మిగిలిన ఇద్దర్ని గౌరవంగా ప్రభుత్వానికి అప్పగిస్తున్నానని వివరించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నేను గన్‌మెన్ స్వీకరించలేదు. ఎక్కడికైనా ఒంటరిగా వెళ్తానని.. ఏం భయపడనని అన్నారు. ప్రజల గొంతుకే నా గొంతుక అని వివరించారు. సినిమా డైలాగులు చెప్పటం లేదని.. అసలు నిజమిదేనని తగ్గేదేలే అని హెచ్చరించారు. మరింత పట్టుదలతో ముందుకెళ్తానని అన్నారు. 175 సీట్లలో అన్నింటిలో విజయం సాధిస్తామని చెప్తున్నవారు.. ఒక్క ఎమ్మెల్యే వ్యతిరేకిస్తే మీకు ఇంతా భయమా అని ప్రశ్నించారు. ఒక్కడిని లక్ష్యంగా చేసుకుని బెదిరింపు కాల్స్ చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను పొరపాటు చేసి ఉంటే భగవంతుడు, ప్రజలు నాకు శిక్ష వేస్తారని కోటంరెడ్డి అన్నారు. తాను తప్పు చేయలేదని భావిస్తే నాకు అండగా ఉండాలని ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు. భద్రతా విషయంలో తన తలరాత ఏ విధంగా ఉంటే అలానే జరుగుతుందని పేర్కొన్నారు. ఇన్నాళ్లపాటు తనకు సెక్యూరిటీగా విధులు నిర్వర్తించిన ఇద్దరు సిబ్బందికి ఆయన వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన గన్‌మెన్లను గుండెలకు హత్తుకొని ఓదార్చారు.
ఇవీ చదవండి: