Sabitha Respond On Banjarahills Girl Rape Case: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ బంజారాహిల్స్‌లో చిన్నారిపై లైంగికదాడి ఘటనపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్యలు చేపట్టారు. బంజారాహిల్స్ డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్ డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇతర పాఠశాలల్లో విద్యార్థులను సర్దుబాటు చేయాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాలు నివృత్తి చేసే బాధ్యత డీఈవోదేనని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. భద్రతా పరమైన చర్యలు ప్రభుత్వానికి సూచించేందుకు కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యా శాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కమిటీ తన నివేదికను వారం రోజుల్లోగా అందిస్తుందని పేర్కొన్నారు. నివేదిక ఆధారంగా విద్యార్థుల భద్రతకు సంభందించి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.