ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గౌతమ్ రెడ్డి అంత్యక్రియల స్థలం మార్పు.. ఎక్కడంటే? - ఏపీ వార్తలు

Mekapati Goutham Reddy Funerals: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి. అయితే అంత్యక్రియలు జరిగే స్థలాన్ని మార్పు చేస్తున్నట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు. తొలుత స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో జరపాలని భావించినప్పటికీ.. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరిపేందుకు నిర్ణయించారు.

minister Mekapati Goutham Reddy
minister Mekapati Goutham Reddy

By

Published : Feb 21, 2022, 10:32 PM IST

Mekapati Goutham Reddy Funerals: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల స్థలాన్ని మార్చుతున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే.. ముందుగా గౌతమ్ రెడ్డి పార్థివదేహాన్ని ఆయన స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహించాలని భావించారు. రేపు ఉదయం నెల్లూరుకు ఎయిర్‌ అంబులెన్స్‌లో గౌతమ్‌రెడ్డి భౌతికకాయం తీసుకురానున్నారు. ప్రజల సందర్శనార్థం నెల్లూరులోని మేకపాటి గెస్ట్‌ హౌస్‌లో గౌతంరెడ్డి పార్థివ దేహాన్ని ఉంచుతారు. బుధవారం ఉదయం ఇక్కడి నుంచి ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీకి తరలించనున్నారు. అక్కడే గౌతమ్‌రెడ్డికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. అంత్యక్రియల్లో సీఎం జగన్, మంత్రులు, వైకాపా నేతలు పాల్గొననున్నారు.

గౌతమ్ రెడ్డి మృతి.. ఏం జరిగిందంటే..?
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (49) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. ఈ ఉదయం గుండెపోటు రావడంతో హుటాహుటిన గౌతమ్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. గౌతమ్‌ రెడ్డి ఇంటి వద్ద కుప్పకూలడంతో ఉదయం 7.45గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారని వైద్యులు తెలిపారు. స్పందించని స్థితిలో మంత్రి ఆస్పత్రికి వచ్చారన్నారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే గౌతమ్‌రెడ్డికి శ్వాస ఆడట్లేదని వైద్యులు తెలిపారు. తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయిందని చెప్పారు. అనంతరం గౌతమ్‌రెడ్డి చనిపోయినట్లు 9.16గంటలకు అపోలో వైద్యులు ప్రకటన విడుదల చేశారు.

గౌతమ్‌రెడ్డి రాష్ట్ర ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత వారం రోజులుగా దుబాయ్‌ ఎక్స్‌పోలో ఆయన పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరిపారు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొన్న అనంతరం నిన్ననే హైదరాబాద్‌ చేరుకున్నారు.

ఏపీలో అధికార వైఎస్సార్‌సీపీకి ఆది నుంచి బలమైన మద్దతుదారుగా ఉన్న పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి కుమారుడు గౌతమ్‌ రెడ్డి. ఆయన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండుసార్లు గౌతమ్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో వైకాపా తరఫున ఆయన విజయం సాధించారు.

గౌతమ్‌రెడ్డి తొలిసారిగా 2014లో ఆనం రామనారాయణ రెడ్డిపై విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ సమయంలో జిల్లాలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన నాయకుడిగా గౌతమ్‌ రికార్డు సృష్టించారు. 2019లో రెండో పర్యాయం ఆయన బొల్లినేని కృష్ణయ్యపై విజయం సాధించి కేబినెట్‌ మంత్రిగా చోటు దక్కించుకున్నారు. గత నెల 22వ తేదీన మేకపాటి గౌతమ్‌రెడ్డి కరోనా బారినపడ్డారు. అప్పట్లో స్వల్పలక్షణాలు ఉండటంతో చికిత్స పొంది కోలుకొన్నారు.

మేకపాటి గౌతమ్‌ రెడ్డి ప్రొఫైల్‌..

* తల్లిదండ్రులు: మేకపాటి రాజమోహన్‌ రెడ్డి-మణిమంజరి

* పుట్టిన తేదీ: 2-11-1971

* విద్య: హైదరాబాద్‌ భద్రుకా కాలేజ్‌లో గ్రాడ్యూషన్‌, యూకేలో ఎమ్మెస్సీ టెక్స్‌టైల్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు.

* వ్యాపారం: 1997లో కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్‌లో వ్యాపార జీవితం మొదలుపెట్టారు.

* రాజకీయ రంగ ప్రవేశం: 2014లో ఆత్మకూర్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.

* భార్య : మేకపాటి శ్రీకీర్తి

* పిల్లలు: ఒక కుమార్తె, ఒక కుమారుడు

* బాబాయ్‌: మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (ఎమ్మెల్యే)

ఇదీ చదవండి:

"నొప్పి పెడుతోంది కీర్తి.. మంచినీళ్లు ఇవ్వు" గౌతమ్‌ రెడ్డి చివరి మాటలు!

ABOUT THE AUTHOR

...view details