నెల్లూరు కోర్టులో జరిగిన చోరీతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై ఏ విచారణకైనా సిద్ధమన్న మంత్రి.. ఆరోపణ చేసేవాళ్లు సీబీఐ విచారణ కోరవచ్చున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించిన కాకాణి.. పవన్ నటనకు మాత్రమే పనికొస్తారన్నారు. తనకు ఎవరితోనూ భేదాభిప్రాయాలు లేవని.., పార్టీలో అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు.
"కోర్టులో చోరీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కోర్టులో చోరీ అంశంపై ఏ విచారణకైనా సిద్ధం. చోరీ ఘటనపై సీబీఐ విచారణ జరిపించుకోవచ్చు. హైకోర్టు స్థాయిలో కూడా విచారణ చేయించుకోవచ్చు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందున ప్రభుత్వ విచారణ చేయించుకోవచ్చు. ప్రభుత్వ విచారణ తర్వాత ఎలాంటి విచారణకైనా సిద్ధం. పవన్‌కల్యాణ్ నటనకే పనికొస్తారు. నాకు ఎవరితోనూ భేదాభిప్రాయాలు లేవు. పార్టీలో అందరం కలిపి పనిచేస్తాం." - కాకాణి గోవర్దన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
ఇదీ జరిగింది..:నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఓ కోర్టులో దొంగలు పడ్డారు. కీలక కేసుకు సంబంధించిన పత్రాలు అపహరించారు. విషయాన్ని గుర్తించిన కోర్టు సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. నెల్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కేసులో పత్రాలు, స్టాంపులు, ఇతర పరికరాలున్న సంచి అపహరణకు గురైనట్లు కోర్టు బెంచి క్లర్క్ స్థానిక చిన్నబజారు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు కోర్టు సముదాయంలోని 4వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో 13వ తేదీ అర్ధరాత్రి కొందరు వ్యక్తులు చొరబడ్డారు. ఓ కీలక కేసులో పత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకువెళ్లారు. 14వ తేదీ (గురువారం) ఉదయం కోర్టుకొచ్చిన సిబ్బంది దొంగతనం జరిగినట్లు గుర్తించి.. పోలీసులకు సమాచారమిచ్చారు. దొంగతనానికి గురైన సంచిని కోర్టు బయట ఉన్న కాలువలో గుర్తించిన పోలీసులు దాన్ని పరిశీలించగా.. అందులో ఉండాల్సిన పలు దస్త్రాలు మాయమైనట్లు గుర్తించారు. వెంటనే విచారణ చేపట్టారు.