Michaung Cyclone Effect In Nellore: మిగ్‌జాం తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. నెల్లూరు జిల్లాలో తుపాను ప్రభావంతో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నెల్లూరు, కావలి పట్టణంలో భారీగా వర్షపాతం నమోదైంది. తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు నగరం చెరువును తలపిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.ప్రధాన రహదారులపై మోకాలి లోతు నీళ్లు చెరాయి. నిన్నటి నుంచి నెల్లూరు జిల్లాలో ఈ తుపాను ప్రభావం అధికంగా ఉంది. తుమ్మలపెంట, పెదపట్టుపాలెం, కొత్తసత్రం వంటి పలు ప్రాంతాల్లో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఇప్పటికే మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జాలర్లు ఉపయోగించే పడవలు, వలలు వంటివి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
దూసుకొస్తున్న మిగ్‌జాం తుపాను- ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు
Rain Water Coming In Roads: నెల్లూరు నగర శివారు ప్రాంతాలైన ఆర్టీసీ కాలనీ, తల్పగిరి కాలనీ, చంద్రబాబు నగర్, వైఎస్ఆర్ నగర్ ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. మోకాలి లోతు నీళ్లు చేరడంతో నివాసాల్లోని ప్రజలు బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నారు. నగర నడిబొడ్డులో ఉన్న గాంధీ బొమ్మ సెంటర్లో స్థానిక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు దిగువ ప్రాంతాలను ముంచెత్తుతోంది. నగరంలో ఉన్న అండర్ బ్రిడ్జిల్లోకి ఒక్కసారిగా భారీగా నీరు రావటంతో పలు వాహనాలు అందులోనే చిక్కుకుపోయాయి. భారీ వర్షం కురవడంతో డ్రైనేజీలు చిన్నవిగా ఉండటంతో వర్షపునీరు బయటకు పోవడంలేదు. మిషన్లతో కాలువల్లో పూడికలు తీయిస్తు నీటిని బయటకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా రెండు రోజులు పాటు భారీ వర్షాల సూచన ఉండటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.