Mekapati Chandrasekhar Reddy challenge : నెల్లూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార పార్టీ నాయకుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల వాతావరణం రసవత్తరంగా మారింది. తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే నెపంతో అధికార పార్టీ నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యాన.. నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆ ముగ్గురూ గెలిస్తే.. తాను రాజకీయాలు మానుకుంటానని చెప్పారు. ఒకవేళ.. తాను గెలిచి అసెంబ్లీకి వస్తే మీరంతా రాజకీయాల నుంచి తప్పుకుంటారా..? అని సవాల్ చేశారు. దీనిపై ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అంతే స్థాయిలో దీటుగా బదులిచ్చారు. 'వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి చూపిస్తా... గెలవకపోతే రాజకీయాలు పూర్తిగా వదిలేస్తా... నువ్వు గెలవకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటావా? నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదు.' అని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి.. నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ ను ఉద్దేశించి సవాల్ విసిరారు.
ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బెంగూళురు నుంచి స్వగ్రామమైన మర్రిపాడుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి చూపిస్తా. గెలవకపోతే రాజకీయాలు పూర్తిగా వదిలేస్తా. నువ్వు గెలవకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటావా? నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదు. సింగిల్ డిజిట్ తో గెలిచిన నువ్వు ఎక్కడ.. 35 వేలమెజార్టీతో గెలిచిన నేనెక్కడ..? వచ్చే ఎన్నికల్లో నేను, ఆనం, కోటంరెడ్డి గెలవడం ఖాయం. అని పేర్కొన్నారు.