Government Hospital Medical Staff are Sidetracked for Money: వైద్యులని, వైద్య సిబ్బందిని దేవుడితో సమానంగా చూస్తాం. కానీ అటువంటి వారే అడ్డదారులు తొక్కుతూ కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. నిత్యం ఎంతోమంది రోగులు, గర్భిణీలు ఆ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి వస్తూ ఉంటారు. ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యం చేయించుకోలేని అనేకమంది గిరిజనులు, పేద ప్రజలు.. ఆ హాస్పిటల్‌కే వస్తూ ఉంటారు.
కానీ వారి పేదరికాన్ని, ఎంతో కష్టాలతో వచ్చే గిరిజనులను చూసి ఆ ఆసుపత్రి వైద్య సిబ్బంది మనసు ఏం మాత్రం చలించలేదు. గిరిజనుల దగ్గర నుంచి కూడా డబ్బులను దోచుకోవాలని అనుకున్నారు. ఇంకేం ఉంది.. ఆసుపత్రి బయట ఉన్న ఓ స్కానింగ్ సెంటర్ వ్యక్తితో కుమ్మక్కయ్యారు. అడిగేవారే లేరన్నట్టుగా.. యథేచ్ఛగా తమ దందా మొదలుపెట్టారు. అవసరం లేకపోయినా సరే.. కరోనా టెస్టు, స్కానింగ్ అంటూ.. బయట స్కానింగ్ సెంటర్‌కు వెళ్లి టెస్టులు చేయించుకుని రమ్మనేవారు. డబ్బులు లేక.. ఎంతో దూరం నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న పేద ప్రజలను దోచుకుంటున్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని జిల్లా వైద్యశాలలో ఈ తతంగమంతా జరుగుతోంది. గర్భిణీలకు అవసరం లేకపోయినా.. జిల్లా వైద్యశాలలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న పెంచలయ్య అనే వ్యక్తి.. ప్రైవేటు క్లినిక్ సెంటర్‌కు స్కానింగ్‌లకు పంపిస్తున్నారు. ప్రైవేట్ క్లినిక్ సెంటర్ పెంచలయ్యతో కుమ్మక్కై కాసులకు కక్కుర్తి పడి డాక్టర్లు ఆసుపత్రి నుంచి ప్రైవేట్ ల్యాబ్‌కు రాసి పంపిస్తున్నారు.