Manasanamaha Short Film: మనోజ్ బాజ్‌పేయ్, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, పుష్ప సినిమా. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకల్లో అవార్డులు అందుకున్న పేర్లు ఇవి. ఈ జాబితాలో వినిపించిన మరో తెలుగు పేరు దీపక్. ఇతను మనసానమః షార్ట్‌ఫిల్మ్ దర్శకుడు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాల్లో లఘుచిత్రాల విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. ఇదొక్కటే కాదు.. మనసానమహః గెల్చుకున్న అవార్డులు, పురస్కారాలు, ప్రదర్శితమైన వేదికలు.. అన్నీ కలిపితే అక్షరాలా తొమ్మిది వందలు.
పడ్డ ప్రతి బొమ్మా చూడాల్సిందే..
కర్నూలుకు చెందిన దీపక్‌ది విద్యావేత్తల కుటుంబం. తనకేమో సినిమాల పిచ్చి. పడ్డ ప్రతి బొమ్మా చూడాల్సిందే. దాంట్లోనే కెరియర్ అనేవాడు. ఇంట్లోవాళ్లు హడలిపోయారు. వాళ్ల బలవంతంతో బీటెక్ పూర్తి చేశాడు. కొన్నాళ్లు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు. తర్వాత మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్లాడు. చదువు పూర్తై వెనక్కి తిరిగొస్తున్న సమయంలో.. సహాయ దర్శకుడిగా చేయమంటూ దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి పిలుపొచ్చింది. బీటెక్‌లో స్నేహితులతో కలిసి సరదాగా తీసిన షార్ట్‌ఫిల్మ్ ఈ అవకాశం తెచ్చిపెట్టింది. 35 రోజులు ‘ఫిదా’కి పని చేశాడు. ఆపై అతడి సినిమా కల రెట్టింపైంది.
బాగుందంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు..
2019లో దీపక్ భారత్ తిరిగొచ్చేశాడు. అప్పటికే రెండు లఘుచిత్రాలు తీసిన అనుభవం ఉంది. ఈసారి ఫీచర్ ఫిల్మ్‌కి తగ్గకుండా మంచి షార్ట్‌ఫిల్మ్ తీయాలనుకున్నాడు. దాన్ని తన తెరంగేట్రానికి వేదికగా మలచుకోవాలనుకున్నాడు. కానీ అది అనుకున్నంత తేలికేం కాదని అర్థమైంది. నటీనటుల ఎంపిక, బడ్జెట్, లొకేషన్, చిత్రీకరణ.. ప్రతిచోటా ఇబ్బందే ఎదురైంది. కొంచెం పేరున్న నటీనటుల్ని అడిగితే సినిమా అయితేనే చేస్తాం అన్నారు. మరోవైపు డబ్బులు పెట్టేవాళ్లు లేరు. ఆరునెలలు ప్రయత్నించి విసిగిపోయాడు. ఇక ఈ ప్రాజెక్ట్ వదిలేద్దాం అనుకుంటున్న దశలో సోదరి శిల్ప ముందుకొచ్చింది. విరాజ్ అశ్విన్, ద్రిషికా చందర్ నటించడానికి ఒప్పుకున్నారు. షూటింగ్ పూర్తై యూట్యూబ్‌లో విడుదల చేశాక మనసానమః సంచలనం సృష్టించింది. క్రిష్, సుకుమార్, అడవి శేష్, గౌతమ్ మీనన్, సందీప్ కిషన్, అనుష్క, రష్మిక మందన్న, ప్రియదర్శిలాంటి ప్రముఖులు ఎంతో మెచ్చుకున్నారు. బాగుందంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. ఈ గుర్తింపుతోనే పెద్ద బ్యానర్‌లో ఒక సినిమాకి దర్శకుడిగా సంతకం చేశాడు దీపక్.