ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Psycho Lover: యువకుడి ఘాతుకం.. ప్రేమను నిరాకరించిందని విద్యార్థిని హత్య - గూడూరులో విద్యార్థిని హత్య

నెల్లూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. ప్రేమించాలని వేధింపులకు గురిచేస్తున్న యువకుడు.. యువతి ఇంటికి వచ్చి కత్తితో పొడిచి, తర్వాత చున్నీతో బిగించి హతమార్చాడు. యువతిని చంపేసి ఆ తర్వాత అతనూ.. ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

man murdered a girl in name of love
man murdered a girl in name of love

By

Published : Jul 2, 2021, 6:57 AM IST

Updated : Jul 2, 2021, 7:25 AM IST

ప్రేమోన్మాది ఘాతుకానికి మరో విద్యార్థిని బలయ్యారు. తన ప్రేమను నిరాకరించిందని ఇంట్లోనే ఆమెను చంపిన యువకుడు తర్వాత ఆత్మహత్యాయత్నం చేశాడు. నెల్లూరు జిల్లా గూడూరులో గురువారం చోటుచేసుకున్న ఈ సంఘటన కలకలం రేపింది. గూడూరులో నివసించే పి.సుధాకర్‌, సరిత దంపతులు ఉపాధ్యాయులు. వీరి కుమార్తె తేజశ్వని ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్నారు. సుధాకర్‌ సహచర ఉద్యోగి అయిన చెంచుకృష్ణయ్య కుమారుడు వెంకటేష్‌కు, తేజశ్వనికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఏడాదిగా వెంకటేష్‌ ప్రవర్తనతో విసిగిన తేజశ్వని.. ఈ విషయాన్ని పెద్దలకు చెప్పారు. ఈ నేపథ్యంలో వెంకటేష్‌ను చెంచుకృష్ణయ్య బెంగళూరు పంపారు. కరోనా కారణంగా ఈ ఏడాది మొదట్లో వెంకటేష్‌ గూడూరు వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. ప్రేమపేరుతో యువతిని వేధించడం మొదలుపెట్టాడు. ఈ వేధింపులకు తట్టుకోలేక ఆమె తన ఫోన్‌ నంబరు మార్చారు.

పదునైన చాకుతో...

సుధాకర్‌, సరిత.. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లగా.. ఇంట్లో తేజశ్వని, ఆమె తమ్ముడు కార్తిక్‌ ఉన్నారు. 11 గంటల సమయంలో వెంకటేష్‌, తన స్నేహితుడిని వెంటబెట్టుకుని తేజశ్వని ఉండే అపార్ట్‌మెంట్‌ దగ్గరకు వచ్చాడు. తాను కిందే ఉండి స్నేహితుడిని పైకి పంపాడు. అతను విద్యార్థిని ఫ్లాట్‌కు వచ్చి ఆమె ఫోన్‌ నంబరు అడిగాడు. దీంతో కార్తిక్‌ అప్రమత్తమై ఈ విషయాన్ని తండ్రికి చెప్పేందుకు తన ఫోన్‌ తీసుకుని కిందికి వచ్చాడు. కార్తిక్‌ కిందికి రావడాన్ని గమనించిన వెంకటేష్‌ వెంటనే వేగంగా పైకి వెళ్లి తన స్నేహితుడిని అక్కడి నుంచి పంపేశాడు. తేజశ్వని ఉన్న గదిలోకి వెళ్లి తలుపు మూసి.. పదునైన చాకుతో ఆమె గొంతులో పొడిచాడు. తర్వాత చున్నీని ఆమె మెడకు బిగించి, చంపాడు.

సుధాకర్‌ అప్రమత్తమైనా...

కార్తిక్‌ ద్వారా విషయం తెలుసుకున్న సుధాకర్‌.. డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. ఎస్సై ఆదిలక్ష్మి, సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మూసిఉన్న గది తలుపులను బలవంతంగా తెరచుకుని లోపలికి వెళ్లేసరికే..అపస్మారక స్థితిలో పడి ఉన్న తేజశ్వని.. చీరతో కిటికీకి ఉరేసుకున్న వెంకటేష్‌ కనిపించారు. పోలీసులు ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. తేజశ్వని అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. వెంకటేష్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యంకోసం నెల్లూరు తరలించారు. గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, ఇన్‌ఛార్జి సీఐ శ్రీనివాసులురెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సుధాకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటేష్‌, చెంచుకృష్ణయ్య, వెంకటేష్‌ స్నేహితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

విషాదం: పుట్టిన రోజు వేడుకలకు వెళ్లిన యువకులు.. అనుమానాస్పద మృతి

Last Updated : Jul 2, 2021, 7:25 AM IST

ABOUT THE AUTHOR

...view details