ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాంధీ 150: మహాత్ముడే ప్రారంభించిన రెండో సబర్మతి - గాంధీ 150వ జయంతి

దక్షిణాదిలో రెండో సబర్మతిగా పేరుగాంచింది నెల్లూరు జిల్లాలోని పల్లెపాడు గాంధీ ఆశ్రమం. మహాత్ముడే స్వయంగా ప్రారంభించిన ఈ ఆశ్రమం... స్వతంత్ర సమరయోధుల స్పర్శలతో పునీతమైంది. బాపూజీ ఆశయాలు ఎలుగెత్తి చాటుతున్న ఈ ఆశ్రమం చరిత్రాత్మక చిహ్నంగా నిలుస్తోంది.

Mahatma Gandhi

By

Published : Sep 25, 2019, 7:34 AM IST

Updated : Sep 26, 2019, 7:01 AM IST

మహాత్ముడే ప్రారంభించిన రెండో సబర్మతి

జాతిపిత మహాత్మాగాంధీ రెండుసార్లు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని పల్లెపాడుకు వచ్చారు. ఇక్కడున్న ఆశ్రమం స్వాతంత్రోద్యమంలో కీలకపాత్ర పోషించింది. అంటరానితనం నిర్మూలనలో భాగంగా బాపూజీ చేతుల మీదుగా 1921 ఏప్రిల్ 7న ఈ ఆశ్రమం ప్రారంభమైంది. పవిత్ర పినాకినీ నదీతీరం సమీపంలో... సంఘ సేవకురాలు పొనకా కనకమ్మ ఇచ్చిన 13ఎకరాల్లో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు.

బాపూజీ ఈ ఆశ్రమానికి 1929మే 11న మళ్లీ వచ్చారు. ఓ రాత్రి ఇక్కడే బస చేశారు. స్వతంత్ర పోరాటంలో పల్లెపాడు ఆశ్రమం ప్రధాన కేంద్రంగా పనిచేసింది. పల్లెపాడుకు చెందిన హనుమంతరావు, చతుర్వేదుల కృష్ణయ్యలు ఆశ్రమ నిర్మాణాన్ని చేపట్టగా... గాంధీ సన్నిహితుడు రుస్తుంజీ అప్పట్లో రూ.10వేలు విరాళం ఇచ్చారు. దీంతో ఆశ్రమ ప్రధాన భవనానికి రుస్తుంజీ పేరుపెట్టారు. ఈ ఆశ్రమంలో నూలు వడకటం, ఖాదీ ఉత్పత్తి, గీతా పారాయణం, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు.

తర్వాత కాలంలో నిర్వాహకులు జైలుపాలు కావడం కారణంగా... ఖాదీ ఉత్పత్తి నిలిచిపోయింది. కాలక్రమేణా భవనం శిధిలావస్థకు చేరి ఉనికి కోల్పోయే దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో 2006లో రెడ్​క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో భవనం పునర్నిర్మాణం జరిగింది. ఆశ్రమ అభివృద్ధికి కమిటీ ఏర్పాటు చేసి... గాంధీజీ సిద్ధాంతాలు, ఆశయాలు ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా గాంధీ జయంతి, వర్ధంతి రోజుల్లో ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Last Updated : Sep 26, 2019, 7:01 AM IST

ABOUT THE AUTHOR

...view details