Protest about not Getting Ration: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో రేషన్ అందడం లేదని.. పలు కాలనీలకు చెందిన కుటుంబాలు ఆందోళనకు దిగాయి. ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వారు నిరసన చేపట్టారు. నాలుగు నెలల నుంచి తమకు రేషన్ ఇవ్వకుండా.. నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. తామంతా నిరుపేదలం అని.. రేషన్ బియ్యం ఇస్తేనే తమ ఇల్లు గడుస్తుందని తెలిపారు. బియ్యం అందకపోవడంతో నాలుగు నెలలుగా తీవ్రంగా అవస్థలు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రేషన్ షాపుల దగ్గర తీసుకున్నప్పుడే.. చాలా బాగుండేదని.. సమయానికి రేషన్ తీసుకునే వాళ్లమని తెలిపారు. కానీ వాహనాలు వచ్చినప్పటి నుంచీ.. అనేక కష్టాలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై డిప్యూటీ తహసీల్దారుని కలిసి వినతి పత్రం ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.
ఆత్మకూరు మున్సిపాలిటీ పరిదిలోని 4వ వార్డు, 19వ వార్డులలోని కుటుంబాలకు రేషన్ అందటం లేదని.. అదికారులను అడిగితే స్టాక్ అయిపోయిందని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల ఇస్తామని పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని బాధితులు వాపోయారు.
"సర్.. మాకు బియ్యం ఇవ్వట్లేదు. నెల నెలా వీళ్లని అడుక్కోవాలి. అక్కడ పెట్టినాం.. ఇక్కడ పెట్టినాం అని ఏవేవో అంటున్నారు. వాళ్లు వచ్చేంత వరకూ మేము.. మా పనులన్నీ మానుకొని ఉండాలి. ఇప్పుడేమో ఇక్కడికి వస్తే.. పై అధికారులకు చెప్పాలి అంటున్నారు. అందరం కూలి పనులు చేసుకునే వాళ్లము. అవే కదా తినాలి. మాకు ఉన్న ఈ సమస్య తీరిస్తే చాలు. మూడు, నాలుగు నెలలుగా ఇదే పని. ఈ నెల అస్సలు రాలేదు". - బాధితురాలు