నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని బాలాజీ నగర్లో ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దంటూ స్థానికులు అడ్డుకున్న కారణంగా.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తి, తోపులాటకు దారితీసింది. మెుదటి నుంచీ మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని స్థానికులు ఆందోళన చేస్తున్నా, ఎక్సైజ్ పోలీసులు పట్టించుకోలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా దుకాణం ప్రారంభించేందుకు ప్రయత్నించగా.. స్థానికులు అడ్డుకున్నారు. ఈ నెల 1వ తేదీన మద్యం దుకాణం ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధం కాగా, స్థానికులు, మహిళలు అడ్డుకోవడం వల్ల కార్యక్రమం వాయిదా పడింది. గురువారం మళ్లీ దుకాణం తెరవటానికి ప్రయత్నించారు. రైతు సంఘం జిల్లా నాయకుడు వెంకటయ్యతో కలసి స్థానికులు దుకాణం తలుపులు మూసే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరిగి తోపులాటకు దారి తీయగా... పోలీసులు కలగజేసుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు.
మద్యం దుకాణంపై వాగ్వాదం.. శాంతింపచేసిన పోలీసులు
ఉదయగిరిలో ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటు వద్దంటూ స్థానికులు ఎక్సైజ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
నాయకులకు పోలీసులకు సర్దిబాటు చేసిన స్థానికులు