DIED: శ్రీపొట్టిశ్రీరాములు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువస్తే.. స్వీపర్, సెక్యూరిటీ గార్డులు చికిత్స చేయడంతో పరిస్థితి విషమించింది. కట్లు కట్టడం అయిపోయిన తర్వాత తీరిగ్గా వచ్చిన డ్యూటీ డాక్టర్ శాంత కనీసం పరిశీలించకుండానే.. నెల్లూరుకు తీసుకుపొమ్మని చెప్పారు. ఆ వ్యక్తి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన రామకృష్ణారావు (49) అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నారు. రామకృష్ణారావుకు తీవ్ర గాయాలు కావడంతో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో వైద్యులు ఎవరూ లేకపోవడంతో.. అక్కడే ఉన్న స్వీపరు, సెక్యూరిటీ గార్డులు వైద్యం మొదలు పెట్టారు. వారే కట్లుకట్టారు. అనంతరం అక్కడికి వచ్చిన డ్యూటీ డాక్టర్ సరిగా చూడకుండానే పరిస్థితి విషమంగా ఉందని.. వెంటనే నెల్లూరుకు తీసుకువెళ్లాలని చెప్పి వెళ్లిపోయారు. బంధువులు ఆయనను అత్యవసరంగా నెల్లూరు తరలించడానికి సిద్ధమయ్యారు. సెక్యూరిటీ గార్డులు కట్టిన కట్లు.. బాధితుడిని అంబులెన్స్‌లోకి ఎక్కించే వరకూ నిలవలేదు. మధ్యలోనే ఊడిపోవడంతో మరోసారి కట్టే ప్రయత్నం చేశారు. చివరకు ఆయనను నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా.. మృతి చెందారు. ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్వాకంవల్లే రామకృష్ణారావు చనిపోయాడని ఆయన కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. బాధితుడిని డ్యూటీ డాక్టరు పరిశీలించారని, సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్లే సెక్యూరిటీ సిబ్బంది సహాయం తీసుకున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి చెప్పారు. ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తొలగించడంతోపాటు ఇన్‌ఛార్జి మెడికల్ ఆఫీసర్, సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేశామని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారి (డీసీహెచ్‌ఎస్) రమేశ్‌నాథ్ తెలిపారు.
సమగ్ర విచారణ జరపండి: మంత్రి రజని