Theft In Court: నెల్లూరు కోర్టు భవనాల సముదాయం వద్ద న్యాయవాదుల నిరసన తెలిపారు. సాక్షాత్తూ కోర్టులోనే చోరీ జరిగితే ఇంకెవరికి చెప్పుకోవాలని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. చోరీ జరిగిన తీరుపైనా వారు అనుమానాలు వ్యక్తం చేశారు. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రధాన ముద్దాయిగా ఉన్న కేసుకు సంబంధించిన పత్రాలు మాత్రమే మాయం కావడంపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దొంగల బారి నుంచి న్యాయస్థానాన్ని రక్షించాలని నినాదాలు చేశారు. సీబీఐ విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.
"ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. అనామక దొంగలను కాదు.. చోరీకి పాల్పడిన అసలు దొంగలను అరెస్టు చేయాలి. కాకాణి మొదటి ముద్దాయిగా ఉన్న కేసు ప్రాపర్టీ చోరీకి గురైంది. వందల కేసులు ఉండగా ఈ ఒక్క కేసు పత్రాలే ఎందుకు దొంగిలించారు. చోరీ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి. భారతదేశ చరిత్రలోనే ఇలాంటి చోరీ జరగలేదు. కేసు పత్రాలు దొంగిలించడం దుర్మార్గమైన చర్య. కోర్టులోనే చోరీ జరిగితే.. ప్రజలు ఎవరి వద్దకు వెళ్లాలి? ఆలీబాబా 40 దొంగలు మాదిరిగా ఉంది ఈ ప్రభుత్వ వ్యవహారం."- న్యాయవాదులు
నిందితుల బెయిలు రద్దుచేయాలి
మంత్రి కాకాణిపై నమోదైన కేసులో.. కొన్ని పరికరాలు, వస్తువులను పోలీసులు సీజ్ చేశారు. ఆ కేసుకు సంబంధించిన ఆధారాలు చోరీకి గురయ్యాయి. దీనిపై అనుమానాలున్నాయి. ఇది సామాన్య దొంగలు చేసినది కాదు. చోరీ జరిగిన ప్రాంతం పరిశీలిస్తే న్యాయవాదులమైన మాకు అర్థమవుతోంది. నిందితులను రక్షించేందుకే ఇలా చేశారు. నిందితులకు బెయిలు రద్దు చేయాలి.- సి.హరినారాయణ, న్యాయవాది
పోలీసులపై నమ్మకం లేదు
కోర్టులో జరిగిన దొంగతనంలో అసలు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించడం లేదు. సమగ్ర విచారణ చేయకుండానే.. ఇద్దరు దొంగలను ఇరికించి పక్కదారి పట్టించాలని చూస్తున్నారు. ఈ ప్రభుత్వం, పోలీసులపై నమ్మకం లేదు. కోర్టు సుమోటోగా తీసుకోవాలి. రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. - షేక్ అన్వర్‌బాషా, న్యాయవాది