నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో.. చదువుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. బడి ఆవరణలోకి అడుగుపెట్టగానే అపరిశుభ్ర వాతావరణం వారికి స్వాగతం పలుకుతుంది. చుట్టూ పెరిగిన పిచ్చిమొక్కల నుంచి ఏ పాము బయటికొస్తుందోనన్న భయంతో విద్యార్థులు వణికిపోతున్నారు. ఇక ఎలాగోలా చదువుకుందామంటే కనీసం తరగతి గదులు కూడా లేవు. ఆరుబయట, చెట్ల కిందే కూర్చుని పాఠాలు వినాల్సిన దుస్థితి. కనీస సౌకర్యాలైన తాగునీరు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వీటికి తోడు సరైన కాపలా లేక రాత్రివేళల్లో పాఠశాల ఆవరణంలో అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.
నాలుగు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు
పాఠశాలకు కనీసం 10.. తరగతి గదులు కావాల్సిఉండగా.. కేవలం నాలుగే ఉన్నాయి. అవి కూడా నేడో రేపో కూలిపోయే స్థితిలో ఉన్నాయి. తగినంత మంది సిబ్బంది కూడా లేకపోవటంతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. మూడేళ్లుగా 6 నుంచి పదో తరగతి వరకూ ఒకే ఉపాధ్యాయుడు జీవశాస్త్రాన్ని బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఇబ్బందులు పడలేక రెండేళ్లలో 50 మంది విద్యార్థులు పాఠశాలను వదిలేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.