Kommarapudi SC Farmers Demanding Compensation : 30 ఏళ్లుగా సీజేఎఫ్ఎస్ భూముల్లో పంటలు సాగు చేసుకుంటున్న ఎస్సీ రైతుల భూములను ప్రభుత్వం సేకరించింది. జగనన్న లేఅవుట్ల కోసం వాటని సన్నకారు రైతుల నుంచి బలవంతంగా తీసుకున్నారు. ఎకరాకి 25 లక్షల రూపాయలు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. ఏడాది తరువాత సగం మందికి పరిహారం చెల్లించారు. సగం మందికి పరిహారం రాకపోవడంతో రైతులు కుటుంబాలు జరుగుబాటు లేక లబోదిబోమంటున్నారు. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయారు. ధర్నాలు, నిరసనలు చేసినా తమ గోడు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎస్సీ రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలోని కొమ్మరపూడి రైతుల దీనమైన పరిస్థితి ఇది. ఈ గ్రామంలోని ఎస్సీ రైతులకు కుటుంబ పోషణ కోసం 30ఏళ్ల కిందట ప్రభుత్వం సీజేఎఫ్ఎస్ భూములు పంపిణీ చేసింది. 122 మంది రైతులకు 65 ఎకరాలు, కుటుంబానికి అరెకరా చొప్పున ఇచ్చారు. ఈ భూముల్లో కూరగాయలు, మిర్చి, మెట్టపైర్లు సాగు చేసుకున్నారు. బోర్లు కూడా వేసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే 2019లో వీరి భూమిని బలవంతంగా తీసుకున్నారు. జగనన్న లేఅవుట్ కోసం సేకరించారు. ఎకరాకి 25 లక్షల రూపాయలు పరిహారం ఇచ్చే విధంగా భూసేకరణ చేశారు.
2021లో ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. అందులో 63 మందికి పరిహారం అందలేదు. అధికారులు ఇస్తామని కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. రెండేళ్లలో 63 మంది రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు, నిరసనలు తెలిపారు. నెలకు మూడుసార్లు గ్రీవెన్స్‌లో వినతులు ఇచ్చారు. మంత్రిని, ఎమ్మెల్యేలను కలిశారు. ఎవరూ స్పందించలేదు.
విసిగిపోయిన 63 కుటుంబాల రైతులు శుక్రవారం కొత్తూరు బిట్2లోని వారి పొలాల్లో బైఠాయించారు. నిరసన నినాదాలు చేశారు. పంటలతో పచ్చగా ఉండే భూముల్లో చిల్ల చెట్లు వచ్చాయి. బోర్లు పూడిపోయాయి. కనీసం జగనన్న లేఅవుట్‌ను కూడా అభివృద్ధి చేయలేదు. రెండేళ్లుగా తమకు పరిహారం అందలేదని రైతులు కన్నీమున్నీరు అవుతున్నారు.