ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అతిథి మర్యాదలు లేక అలిగిన పక్షులు

పక్షుల కిలకిల రావాలకు, రెక్కల చప్పుళ్లకు ఆవాసం ఆ ప్రాంతం. దేశవిదేశాల్లోని విహంగాలు మెచ్చిన పర్యాటక ప్రాంతమది. సుదూర ప్రాంతాల నుంచి పక్షిరాజసాలు ఇక్కడి వచ్చి.. ఆనందంగా విహరించి సంతానాన్ని ఉత్పత్తి చేసుకుని తిరిగి వెళ్లిపోతుంటాయి. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ప్రాంతంపై పక్షులకున్నంత ప్రేమ.. విచక్షణా జ్ఞానమున్న అధికారులకు లేదనిపిస్తోంది. కొంచెం అభివృద్ధి చేస్తే కోట్ల రూపాయలు ఆదాయం ఇచ్చే ప్రాంతం.. అధికారులు కనుచూపు సోకడానికి నోచుకోవడం లేదు.

By

Published : Apr 25, 2019, 9:37 AM IST

కొల్లేరు

కొల్లేరు.... కన్నీరు

అందమైన గూడ బాతులు.. ఆకర్షించే ఎర్రకాళ్ల కొంగలు.. నీటి కంజు పిట్టల సవ్వడులు.. రివ్వు పిట్టల కేరింతలు.. లకుముకి పిట్ట అందచందాలు.. చేపలను ఇట్టే నోట్లో వేసుకొనే నారాయణ పక్షులు.. ఇలా డిసెంబర్ మాసం వచ్చిందంటే చాలు.. కృష్ణా జిల్లా కైకలూరు ఆటపాక పక్షుల కేంద్రం వందల రకాల పక్షులతో సందడిగా మారుతుంది. ఆయా దేశాల్లో వేసవి ఉష్ణోగ్రతలు తట్టుకోలేక శీతాకాలం ప్రవేశించే దేశాలకు వలసలు వస్తుంటాయి. కొల్లేరు సరస్సులో వాటికి అవసరమైన ఆహారం, అనుకూల వాతావరణం ఉన్నందున ఎక్కువగా ఆటపాకకు వస్తుంటాయి. ఇది గతం.
ప్రస్తుతం ఈ ప్రాంతంలో నివాసముండాలంటే పక్షులు జంకుతున్నాయి. బాధలు నోటితో చెప్పుకోలేవు కాబట్టే అధికారులూ పట్టించుకోవడం లేదు. విదేశాల నుంచి ఇక్కడకి వలస వచ్చే పక్షులు... పెద్ద చెట్లపై.. కృత్రిమంగా ఏర్పాటు చేసిన స్టాండ్లపై గూళ్లు ఏర్పాటు చేసుకుని గుడ్లు పెడుతుంటాయి. పక్షులకు ఉపయోగపడేలా కొల్లేరు నదిలోని దిబ్బలపై మొక్కలు పెంపను అధికారులు పట్టించుకోలేదు. కృత్రిమంగా ఏర్పాటు చేసిన స్టాండ్లు ధ్వంసమై సంతానోత్పత్తి కోసం వలస వచ్చే పక్షుల సంఖ్య తగ్గుతోంది.

కనీస సౌకర్యాలు కరవు
ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, సైబీరియా వంటి దేశాల నుంచి ఏటా ఇక్కడికి చేరుకుంటాయీ పక్షులు. ఇక్కడే జతకట్టి... 3 నుంచి 10 రోజుల్లో గుడ్లు పెడతాయి. 30 నుంచి 36 రోజుల్లో గుడ్లు పొదుగుతాయి. 25 రోజుల వరకు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. సుమారు 3 నెలల వ్యవధిలో పిల్లలకు పూర్తిగా రెక్కలు వచ్చి సమూహాల్లోకి చేరుతుంటాయి. ప్రస్తుతం కొల్లేరు ప్రాంతంలో అక్రమ ఆక్వా సాగుతో విదేశీ వలస పక్షుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని పర్యాటకులు అంటుకున్నారు.

దృష్టి పెడితే మహర్దశ
కనీస సౌకర్యాలపై దృష్టి పెడితే కొల్లేరు ప్రాంతం పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతుంది. కానీ వచ్చినవి లక్షల్లో.. ఏర్పాట్లు వందల్లో అన్నట్లు ఇక్కడి పరిస్థితి అధ్వానంగా ఉంది. అంతంత దూరాల నుంచి వచ్చి అలరించే పక్షులకు ఆవాసం కల్పించి మానవత్వం చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యాటకులు చెబుతున్నారు. పక్షుల అవాసాలకు అనుకూల పరిస్థితులు మరింతగా మెరుగుపరిచి ఆటపాక అందాలు కాపాడాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details