Villagers have changed: నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు నాటుసారాకు, దొంగలకు పేరొందిన గ్రామం కప్పరాల తిప్ప. అక్కడి కుటుంబాలను మార్చేందుకు ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేశాయి. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు వారిపై అనేక కేసులు పెట్టారు. పదేళ్లుగా ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేదు. కొందరు పిల్లలు విద్యపై దృష్టి పెట్టటంతో కొంత మార్పు వచ్చింది. ఇంకా అదే వృత్తిలో ఉన్న కొంతమంది తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తే తాము కూడా మారతామంటున్నారు. గ్రామంలో చదువుకున్న విద్యార్థులకు సైతం ఉద్యోగావకాశాలు కల్పించాలని విన్నవించుకుంటున్నారు. ప్రభుత్వం అందిస్తున్న రుణాలతో తమ కష్టాలు తీరవని.. ఉపాధి కల్పించాలని వేడుకుంటున్నారు.
ప్రభుత్వ సహకారంతో పోలీసులు కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున రుణ సాయం అందించారు. దీంతో లబ్ధి పొందిన 24 కుటుంబాల వారు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. కరోనా కాలంలో తీవ్ర ఇబ్బందులు పడ్డామని.. రుణానికి వడ్డీ మాత్రం చెల్లించలేమని లబ్ధిదారులు చెబుతున్నారు. రుణాన్ని సక్రమంగా ఉపయోగించి వాటితో ఉపాధి ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.