తన పేరు కుసుమకుమారి. నెల్లూరు ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసి పదవీ విరమణ పొందిన ఆమె.. పర్యావరణ సమస్యలపై దృష్టి సారించారు. తన వంతుగా ఏదో ఒకటి చేయాలనుకున్న కుసుమకుమారి.. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు కృషి చేయాలనుకున్నారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జనపనార సంచుల తయారీని ఉద్యమంగా నడిపిస్తున్నారు. ఇప్పుడు నెల్లూరులో జూట్ బ్యాగ్స్ అంటే అందరికీ కుసుమకుమారే గుర్తొస్తారు.
జనపనార సంచుల వాడకాన్ని ప్రోత్సహించాలి
పదవీ విరమణ తర్వాత కొంతకాలం జిల్లాలో పొదుపు సంఘాల అధికారిగానూ సేవలు అందించారు. ఉద్యోగం చేసేటప్పుడూ.. ప్లాస్టిక్ నిషేధంపై ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు 67 ఏళ్ల వయసులోనూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు. ప్లాస్టిక్‌కు బదులు జనపనార సంచుల వాడకాన్ని ప్రోత్సహించాలంటూ ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. కుసుమకుమారి కృషిని గుర్తించిన అప్పటి కలెక్టర్ జానకి.. జూట్ బ్యాగ్‌ల తయారీ పరిశ్రమ స్థాపనకు సహకరించారు. మరికొందరు మహిళలకు బ్యాగుల తయారీలో శిక్షణ ఇప్పించిన కుసుమకుమారి.. వారికీ ఉపాధి కల్పిస్తున్నారు. తాము తయారుచేసే ఒక్కో జూట్ బ్యాగ్... పర్యావరణానికి ఎంతో ఉపకరిస్తుందని ఆమె చెబుతున్నారు.