నెల్లూరు జిల్లా లేగుంటపాడుకు చెందిన జాన్ బీబీది ముస్లిం కుటుంబం. 8వ తరగతి పూర్తయ్యాక.. 13ఏళ్ల వయసులోనే ఆమెకు వివాహం జరిగింది. ఆమె భర్త కూలీ పనులు చేసేవారు. వెనకబడిన ప్రాంతంలో ఉండే పరిస్థితులను గమనించి అక్షరాస్యత పెరిగితే సమస్యలు పరిష్కారమవుతాయని భావించింది. మహిళలకు రాత్రి పూట చదువు చెప్పటం ప్రారంభించింది. ఆ సమయంలో సారా వల్ల ఇబ్బందులు పడుతున్న కుటుంబాల గురించి తెలుసుకుని మహిళల్లో చైతన్యం నింపింది. సారా ఉద్యమాన్ని నడిపింది. సారా వ్యాపారం మూతపడటంతో.. ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి. దీంతో వందలాది మంది మహిళలతో పొదుపు సంఘాలు ఏర్పడ్డాయి.
మహిళా బ్యాంకును ప్రారంభించిన జాన్ బీబీ..
పొదుపుపై అవగాహన పెంచుకుని.. రోజుకో రూపాయి చొప్పున బ్యాంకులో దాచుకునేలా మహిళలకు జాన్‌బీబీ నేర్పించింది. కోవూరు ఆంధ్రా బ్యాంకు ద్వారా మహిళలకు రుణాలు ఇప్పిస్తూ.. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహించింది. వేలాదిగా మహిళలు ముందుకు రావటంతో.. తమ పొదుపు నిధులతో తామే ఓ బ్యాంకును నిర్వహించాలని జాన్ బీబీ ఆలోచించారు. 1998 అక్టోబర్ 30న లేగుంటపాడులో మహిళా బ్యాంకును ప్రారంభించారు. మహిళలతోపాటు విద్యార్థులు కూడా బ్యాంకులో డబ్బులు దాచుకునే అవకాశం కల్పించారు. బ్యాంకులో డబ్బులు దాచుకుంటే వడ్డీ కూడా వస్తుందని విద్యార్థులు చెబుతున్నారు.