Andhra Pradesh is Stuck in Debt: జగన్ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయింది.. మరిన్ని రుణాల కోసం భవిష్యత్తును విస్మరిస్తుండడం..ఆందోళనకరంగా మారింది. తాజాగా ఆర్థిక శాఖ అధికారులు, ఏపీ మ్యారిటైం బోర్డు ప్రతినిధులు.. రుణ సమీకరణకు దిల్లీలో విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామీణ విద్యుదీకరణ సంస్థ- ఆర్ఈసీ., పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లను సంప్రదిస్తున్నారు. ఈ క్రమంలో.. భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణానికి 12 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు.. ఆర్ఈసీ అంగీకరించినట్లు సమాచారం. ఆర్ఈసీ ఛైర్మన్‌తో అధికారులు చర్చలు జరపగా.. తొలుత 20 శాతం అడ్వాన్సుగా ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిసింది.అంటే దాదాపు 2వేల 400 కోట్లు ఏపీ మ్యారిటైం బోర్డుకు ఆర్ఈసీ ఇవ్వనుంది.
అభివృద్ధి కార్యక్రమాలకు రుణాలు సేకరించి.., ఆ డబ్బుతో ఆదాయ మార్గాల అన్వేషణను ఎవరూ తప్పుపట్టరు. అయితే ఆస్తులు సృష్టించడం పేరుతో.. తీసుకున్న రుణాన్ని రెవెన్యూ వ్యయానికి మళ్లిస్తే మాత్రం..దాని దుష్ఫలితాలు రాష్ట్రంపై ఏళ్లపాటు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెవెన్యూ వ్యయంతో.. ఆస్తులు సృష్టించుకునే అవకాశం లేదు. ఏపీ మ్యారిటైం బోర్డు తీసుకుంటున్న రుణాన్ని.. నిర్దిష్ట ప్రయోజనాలకే వినియోగించేలా రుణదాతలు షరతు విధిస్తే మంచిదని.. నిపుణులు అంటున్నారు.
ఒక ఇంటి నిర్మాణానికి బ్యాంకు రుణం ఇచ్చేటప్పుడు.. ఎంత పని జరిగిందో పరిశీలించి.. ఆ మేరకే విడతలవారీగా డబ్బులు విడుదల చేస్తుంది. ఏపీలో..ప్రగతి పనుల పేరుతో ఇస్తున్న రుణాలకూ ఇదే తరహా విధానం అమలుచేయాలని నిపుణులు..అభిప్రాయపడుతున్నారు. రీయింబర్సులాంటి నిబంధనలు పాటిస్తే మేలనే అభిప్రాయం.. వ్యక్తమవుతోంది. ఇప్పటికే పోలవరం పనులకు నిధులను కేంద్రం రీయింబర్సు చేస్తోంది. ఆసియా అభివృద్ధి బ్యాంకు, ప్రపంచబ్యాంకు నిధులతో చేపడుతున్న ప్రాజెక్టులకూ.. ఈ నమూనానే ఉంది. ఓవర్‌డ్రాఫ్ట్ నుంచి బయటపడకపోతే ప్రభుత్వ ఖాతాలు స్తంభింపజేస్తామంటూ.. ఒకే నెలలో రిజర్వు బ్యాంకు రెండుసార్లు హెచ్చరించిన వేళ.. తెచ్చుకుంటున్న రుణాలు ఆస్తుల సృష్టికి ఉపయోగించడం మంచిదనే భావన వ్యక్తమవుతోంది.