చేజర్ల మండలం పెళ్లేరు గ్రామ 648 సర్వే నంబరులోని పెన్నా పొరంబోకు భూములపై ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు 18 బోర్లు తవ్వారు. కొందరు ఆ భూములను ఆక్రమించి స్థానికులను వాటిలోకి రానివ్వటం లేదు. దాంతో స్థానికులు జిల్లా పాలనాధికారికి ఫిర్యాదు చేశారు. తిమ్మాయిపాలెంలోని ఒకటో సర్వే నంబరులో ఆక్రమణలపై పలు వివాదాలు కొనసాగుతున్నాయి. కోటితీర్థంలో భూ ఆక్రమణలు అధికంగా ఉన్నాయి. వీటిపై తూర్పుకంభంపాడు, కోటితీర్థంలో వివాదాలు పెరుగుతున్నాయి. ఆక్రమణలపై అధికారుల ఆదేశాలను ఆక్రమణదారులు ఖాతరు చేయటం లేదు. పశువులు, జీవాలు స్వేచ్ఛగా తిరుగుతూ మేత మేసి నీరు తాగే ప్రదేశాలను ఆక్రమించి సాగు చేయటంతో గ్రామాల్లోని పేదలు ఇబ్బందులు పడుతున్నారు.
తాగునీటిని పీల్చేస్తున్న అక్రమ మోటార్లు..
పెన్నానదిలో అక్రమ సాగుకు తీరం వెంబడి ప్రభుత్వ భూముల్లో వందల సంఖ్యలో బోర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో బోరు నుంచి క్యూసెక్కుకు పైగా నీటిని తోడేస్తున్నారు. ఇలాంటి మోటార్లు మండలంలో వందల సంఖ్యలో ఉన్నాయి. సోమశిల జలాశయం నుంచి నెల్లూరు నగరానికి తాగునీటి కోసం విడుదల చేసిన నీరు బోర్లకు మళ్లుతోంది. పెత్తందారుల పలుకుబడితో సమీపంలోని రైతుల సర్వే నంబర్లు చూపి ప్రభుత్వ భూముల్లో ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేయిస్తున్నారు.
చేజర్ల మండలం పెళ్లేరులోని 649 సర్వే నంబరులోని 638 ఎకరాల్లో సగానికిపై ఇతర ప్రాంతాల వారు ఆక్రమించారని, ఈ కారణంగా తమ ఊరి ప్రజల అవసరాలకు ఇబ్బందిగా ఉందని మజరా గ్రామమైన పుల్లనీళ్లపల్లివాసులు జిల్లా పాలనాధికారికి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కలెక్టరు విచారణకు ఆదేశించారు. రెవెన్యూ యంత్రాంగం నిషేధాజ్ఞలు జారీ చేసింది. అయినా ఆక్రమణలు ఆగలేదని గ్రామస్థులు ఈనాడు-ఈటీవీ భారత్ బృందానికి వివరించారు. ఈ భూమి సాగు చేయకుండా ఆపాలని, బోర్లకు విద్యుత్తు సరఫరా ఇవ్వవద్దని వారు కోరుతున్నారు.