నెల్లూరుకు చెందిన గాయత్రి... స్టోన్ హౌస్ పేటకు చెందిన సత్యబాబు, రత్నప్రభ కుమార్తె. ఈ ఏడాది డిగ్రీ పూర్తి చేశారు. ఏడో తరగతి నుంచి బొమ్మలు వేయడంపై ఆసక్తి ఎక్కువ. విభిన్నంగా బొమ్మలు వేయడం అంటే ఇష్టం. ఈ అభిరుచిని డిగ్రీ మొదటి సంవత్సరం నుంచి ప్రారంభించారు. అందులోనూ మైక్రో ఆర్ట్స్ పట్ల అసమాన ఇష్టాన్ని చూపించారు. మైక్రోఆర్ట్స్లో ఎక్కువ మంది మైక్రోస్కోప్‌లో చూస్తూ చిత్రం వేస్తారు.
గాయత్రికి ఎటువంటి పరికరం అవసరం లేదు. 1 సెంటీమీటరు కన్న తక్కువ పొడవు ఉన్న బియ్యపు గింజపై 80 నుంచి 100 అక్షరాలను సూక్ష్మంగా, అందంగా రాయగలరు. అందులోనూ సాధారణ పెన్నుతో ముత్యాల్లా అక్షరాలు రాస్తారు. రంగులతో బొమ్మలు వేస్తారు. సేమియా పుల్లపై పేర్లు రాస్తారు. అందమైన పైయింటింగ్స్ వేస్తారు. ఏకాగ్రతతో బియ్యపు గింజపై పేర్లు రాయడం, చిత్రాలు వేయడం చూస్తే ఆశ్చర్యపోవడం మనవంతు అవుతుంది.
పెన్సిల్ చెక్కి లిడ్‌పై చక్కటి అక్షరాలు తీర్చి దిద్దుతారు గాయిత్రి. చాక్ పీస్‌పై అచ్చుగుద్దినట్లు వినాయకుడు, శివలింగం. నోట్ పుస్తకం చివరలను మడిచి వివిధ ఆకృతుల్లో బొమ్మలు తయారుచేస్తారీమె. ఆవాలు, సబ్జా గింజలు మీద బొమ్మలు వేస్తారు. బియ్యపు గింజమీద ఇండియా పటము. వినాయకుడు, గాంధీ చిత్రాలు చిత్రీకరిస్తారు. ఆకుల మీద చిత్రాలు, పేర్లు రాస్తారు.