నెల్లూరు జిల్లా కావలి నియోజవర్గంలో గ్రావెల్ దందా గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతుంది. కావలి చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రావెల్ అధికంగా లభ్యం అవుతుంది. ఇక్కడి గ్రావెల్కు గిరాకీ ఎక్కువే. పురపాలక సంఘానికి, చుట్టుపక్కల పంచాయతీలకు పన్ను చెల్లించకుండా అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వకాలు చేస్తున్నారు.
పట్టపగలే అక్రమ తవ్వకాలు చేస్తున్నా అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. నాయకుల ఒత్తిళ్లతో అధికారులు ఏంచేయలేని పరిస్థితి నెలకొంది. కావలి చుట్టుపక్కల ముసునూరు, గాయత్రినగర్, మద్దూరుపాడు, తమ్మలపెంటరోడ్డు, అడవిలక్ష్మీపురం, కొత్తశివాలయం, పాతవూరు, రాజీవ్ నగర్ కాలనీల్లో అనధికారిక లేఅవుట్లు వేశారు. ఈ లేఅవుట్ల కోసం రోడ్డు పక్కన, చెరువుల్లో అడ్డుఆపు లేకుండా గ్రావెల్ తవ్వేస్తున్నారు. ఇటీవల వర్షాలకు ఈ గుంతల్లోకి నీరు చేరి ప్రమాదకరంగా మారాయి.