ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రొయ్యల చెరువుల వ్యర్థజలాలతో అన్నదాతకు కాలుష్య కష్టం - ఏపీ లెటెస్ట్ న్యూస్

అధికారుల నిర్లక్ష్యం, అక్రమార్కుల స్వార్థం వెరసి అన్నదాతలకు శాపంగా మారుతోంది. ఇష్టానుసారంగా రొయ్యల చెరువులు తవ్వడం, అనుమతులు లేకుండా బోర్లు వేయడం, విద్యుత్ కనెక్షన్లలోనూ అవకతవకలకు పాల్పడటం, వ్యర్థ జలాలు కాలువల్లోకి వదిలేయడంతో కాలుష్యం పెరిగిపోతుంది. కాలుష్య నియంత్రణ లేకపోవడంతో నెల్లూరు జిల్లా తీరప్రాంత రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు.

water pollution in nellore dist
water pollution in nellore dist

By

Published : Nov 12, 2020, 7:40 PM IST

అనుమతులు లేకుండా రొయ్యల చెరువులు తవ్వేస్తూ.. ఆక్వా మాఫియా నెల్లూరు జిల్లాలో పర్యావరణానికి పెనుముప్పు కలిగిస్తోంది. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో ప్రత్యేక బృందం చేపట్టిన విచారణలో ఈ విషయాలు తేట తెల్లమయ్యాయి. నెల్లూరు జిల్లాలోని కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని ప్రధాన కాలువలు కలుషిత జలాలతో కన్నీరు పెడుతుండగా, అన్నదాతలు కలవరపడుతున్నారు. ప్రధానంగా ఈ మండలాల్లో చల్ల కాలువ, రొయ్యల కాలువ, పాలమడుగు వాగు, పులి కాలువల పరిధిలో దాదాపు 25 వేల ఎకరాలు ఆయకట్టు ఉంది. ఈ కాలువలపై ఆధారపడి దాదాపు పదివేల మంది రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

రొయ్యల చెరువుల వ్యర్థ జలాలు కాలువల్లో కలిసి కలుషితమౌతుండటంతో ఆ నీరు సాగుకు పనికి రాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బకింగ్ హామ్ కెనాల్​లో సైతం వ్యర్థ జలాలు కలుస్తున్నాయి. కోస్టల్ ఆక్వా అథారిటీ నిబంధనల ప్రకారం అనుమతి పొందిన రొయ్యల చెరువుల యజమానులు కేవలం సముద్రపు నీటిని మాత్రమే ఉపయోగించి, సాగు చేపట్టాల్సి ఉంది. బోర్లు తవ్వడానికి భూగర్భ జలాలు వాడడానికి వీల్లేదు. కానీ ఇష్టానుసారంగా బోర్లు తొవ్వి, భూగర్భజలాలను అక్రమార్కులు తోడేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు ఈ ప్రాంతంలో తగ్గిపోతున్నాయి. ఉన్న కాస్త జలాలు ఉప్పునీరుగా మారుతున్నాయి. సర్వే నంబర్లు మార్చి విద్యుత్ కనెక్షన్ పొందుతున్నట్లు అధికారుల విచారణలో తేలింది.

రొయ్యల చెరువుల వద్ద విద్యుత్ తీగల నిర్వహణ అస్తవ్యస్థంగా ఉండడంతో.. అవి ప్రమాదకరంగా మారుతున్నాయి. గత పదేళ్ల నుంచి రొయ్యల చెరువుల కాలుష్యంతో అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రొయ్యల చెరువుల జలాలతో కాలువలు, చెరువులు కలుషితమయ్యాయని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా పొలాలు ఉన్నా పంటలు పండించుకోలేని దీనస్థితిలో ఉన్నామని వాపోతున్నారు.

దశాబ్దకాలంగా రొయ్యల చెరువులతో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి తమకు విముక్తి కలిగించాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి

12 అడుగుల కొండ చిలువకు శస్త్రచికిత్స

ABOUT THE AUTHOR

...view details