ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకృతి సేద్యం.. ఆరోగ్య భాగ్యం - నెల్లూరులో సేంద్రియ వ్యవసాయం న్యూస్

రసాయనాలు, మితిమీరిన ఎరువుల వాడకంతో పండించిన ఆహారోత్పత్తులు అనారోగ్యం కలిగిస్తున్నాయి. దీంతో ప్రకృతి సాగు పద్ధతిలో పండించిన ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతోంది. ఆరోగ్యకరమైన సమాజం ప్రకృతి సాగు ద్వారానే సాధ్యం. అందుకే ప్రభుత్వం ఈ సాగు విధానాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందుకు ఏటా లక్ష్యాన్ని నిర్దేశిస్తోంది. దీన్ని సాధించేందుకు నెల్లూరు జిల్లా అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారు.

organic farming
నెల్లూరులో ప్రకృతి సేద్యం

By

Published : Jul 23, 2020, 6:14 PM IST

ప్రకృతి సాగు చేపట్టేందుకు అన్నదాతలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిటీ ప్రకృతి వ్యవసాయం (ఏపీసీఎన్‌ఎఫ్‌) ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ ఏడాది నిర్ణయించిన మేరకు సాగు లక్ష్యాన్ని సాధించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పెరటి సాగును కూడా ప్రోత్సహించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ప్రకృతి వ్యవసాయం జరుగుతోంది. ఈ పద్ధతిలో సాగుచేసే రైతుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ప్రకృతి సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించడంతోపాటు విక్రయ దుకాణాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో సీఆర్పీల ద్వారా రైతులకు విత్తన శుద్ధి, ద్రవ, ఘన జీవామృతం, వివిధ కషాయాల తయారీ, వాటి వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తరువాత రైతులతో ఎన్‌పీఎం దుకాణాలు ఏర్పాటు చేయించి వాటిని అందుబాటులో ఉంచుతున్నారు. ఇలా ప్రస్తుతం జిల్లాలోని 23 మండలాల్లో 50 వరకు ఎన్‌పీఎం దుకాణాలున్నాయి. ప్రకృతి సాగులో మహిళలను కూడా భాగస్వామ్యం చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఈ ఏడాది 51 వేల ఎకరాలు

జిల్లాలో గత ఏడాది 25 వేల మంది రైతులు 40 వేల ఎకరాల్లో ప్రకతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 24 వేల మంది 36 వేల ఎకరాల్లో ఈ సాగు చేపట్టారు. అలాగే ఈ ఏడాది 50 వేల మంది రైతులు 51 వేల ఎకరాల్లో సాగు చేయించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 6,187 మంది ఎనిమిది వేల ఎకరాల్లో ఈ పద్ధతిలో సాగుచేస్తున్నారు. దీన్ని మరింత పెంచేందుకు జిల్లాలోని 9 నియోజకవరాల్లో అయిదెకరాల చొప్పున ప్రాజెక్టు ఆధ్వర్యంలో కార్యకర్తల ద్వారా ప్రకృతి సేద్యం చేయించి ఆ ప్రాంతంలోని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

పెరటితోటల పెంపకంపై..

పెరటి తోటల పెంపకం పెంచేందుకు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను బృందాలుగా ఏర్పాటుచేస్తున్నారు. గ్రామ సమాఖ్య సంఘాల మహిళలతో సమావేశాలు నిర్వహించి తోటల పెంపకానికి సన్నద్ధం చేస్తున్నారు. ఇంటి ఆవరణలో ఖాళీ స్థలంలో ఒక సెంటు నుంచి ఆపై భూమిలో వివిధ రకాల ఆకు, కాయగూరలు సాగు చేయించేలా చేస్తున్నారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా 14 వేల ఇళ్లలో కిచెన్‌ గార్డెన్స్‌ వేయించారు. ఈ ఏడాది 35 వేల ఇళ్లలో కిచెన్‌ గార్డెన్స్‌ను ఏర్పాటుచేయాలన్న లక్ష్యంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ప్రకృతి వ్యవసాయంపై పెరుగుతున్న ఆసక్తి ‌

జిల్లాలో ప్రకృతి వ్యవసాయం సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడు 51 వేల ఎకరాల్లో సాగు చేయించాలన్న లక్ష్యాన్ని సాధిస్తాం. ఆర్బీకేల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పెరటి తోటల పెంపకానికి మహిళలు ముందుకొస్తున్నారు. -లక్ష్మీమాధవి, జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్

ఇదీ చదవండి:'భావితరాల కోసం మొక్కల పెంపకాన్ని బాధ్యతగా చేపట్టండి

ABOUT THE AUTHOR

...view details