ఆనందయ్య తయూరుచేస్తున్న 'కె' ఔషధం మానవ వినియోగానికి అర్హమైందని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చినందున..... మందు తయారీ, పంపిణీకి ఆటంకం కలిగించొద్దని హైకోర్టు ఆదేశించింది. ఆనందయ్య కంటి చుక్కల మందును స్టెరిలిటీ పరీక్షకు పంపి రెండు వారాల్లోపు నివేదిక అందేలా చర్యలు తీసుకోవాలని.... రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దేశించింది. ఇక అన్నీ అనుకూలిస్తే ఒక విడతలో 10 లక్షల మందికి మందు తయారు చేయగలనని ఆనందయ్య స్పష్టంచేశారు.
కొవిడ్‌కు తయారుచేస్తున్న ఔషధాల పంపిణీలో అధికారులు జోక్యం చేసుకోకుండా నిలువరించాలని కోరుతూ ఆనందయ్యతో పాటు మరికొందరు వేసిన పిటిషన్‌పై... హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఆనందయ్య తయారుచేసే మొత్తం ఐదు రకాల మందుల్లో... పీ,ఎఫ్,ఎల్ మందుల పంపిణీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతిచ్చింది. కె-ఔషధంతో పాటు కంటి చుక్కల మందు విషయంలో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించగా..... నిపుణుల కమిటీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు ఉంచింది.
స్టెరిలిటీ పరీక్ష
కె మందు వినియోగానికి అర్హమైనదన్న కమిటీ..... కంటి చుక్కల విషయంలో స్టెరిలిటీ పరీక్ష నిర్వహించాల్సి ఉందని అభిప్రాయపడింది. అందుకోసం ఒకటి నుంచి మూడు నెలల సమయం పడుతుందని తెలిపింది. చుక్కల మందు తయారీతో పాటు వేసేటప్పుడు అనుసరించాల్సిన విధానంపై పలు సూచనలు చేసింది. నిపుణుల కమిటీ నివేదిక మేరకు చుక్కల మందుపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తంచేస్తున్నట్లు ప్రభుత్వ న్యాయవాది చెప్పిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... కంటి చుక్కల ఔషధానికి స్టెరిలిటీ పరీక్ష సాధ్యమైనంత తర్వగా నిర్వహించి నివేదిక పొందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 'K' మందు పంపిణీ విషయంలో ఆనందయ్యకు ఆవరోధం కలిగించొద్దని అధికారులకు నిర్దేశించింది.