HC on Nellore municipal commissioner: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ (నగర పాలక సంస్థ) అధికారులు అడ్డగోలుగా ఆస్తి పన్ను వసూలు చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. ఇది పౌరులను ప్రభుత్వం వేధించిన కేసని మండిపడింది. ఇలాంటి చర్యలను న్యాయస్థానం అడ్డుకోవాల్సిందేనని పేర్కొంది. పిటిషనరును ఒత్తిడి చేసి అప్పటికప్పుడు భారీగా పన్ను వసూలు చేయడమే కాకుండా దానిని కప్పిపుచ్చుకునేలా కమిషనరు కౌంటరు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనరు నుంచి బలవంతంగా వసూలు చేసిన రూ.34.12 లక్షల ఆస్తి పన్నును 24% వడ్డీతో రెండు వారాల్లో తిరిగి చెల్లించాలని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనరును ఆదేశించింది. పిటిషనరుకు రూ.25వేల ఖర్చులు చెల్లించాలని తేల్చి చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు ఇటీవల ఈ కీలక తీర్పు ఇచ్చారు.
- బలవంతంగా తమ నుంచి రూ.34.12 లక్షలను ఆస్తి పన్ను రూపంలో నెల్లూరు కార్పొరేషన్ అధికారులు వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ జి.విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. ఆస్తి పన్నును రూ.52,200 నుంచి రూ.1.68 లక్షలకు పెంచుతూ 2011లో పిటిషనరుకు, ఆమె సోదరుడికి నెల్లూరు కార్పొరేషన్ కమిషనరు నోటీసు ఇచ్చారు. దానిని సవాలు చేస్తూ 2012లో వారు హైకోర్టును ఆశ్రయించారు.
ఆ వ్యాజ్యాన్ని పరిష్కరించిన న్యాయస్థానం.. నెల్లూరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో అప్పీలు వేసుకోవడానికి స్వేచ్ఛనిచ్చింది. దీంతో పిటిషనర్లు నెల్లూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో 2012లో దావా వేశారు. పన్ను పెంచడాన్ని నెల్లూరు కోర్టు తప్పుబట్టింది. పెంచిన ధరలు చెల్లుబాటు కావంది. పాత పన్నుపై 50% పెంచే స్వేచ్ఛను కమిషనరుకు ఇచ్చింది. పిటిషనరు అప్పటికే చెల్లించిన అదనపు సొమ్మును భవిష్యత్తు చెల్లింపులకు సర్దుబాటు చేయాలంది.