నీట మునిగిన నిమ్మతోటలు
కండలేరుకు జలసిరి పోటెత్తుతోంది.. జలాశయంలో నీటిమట్టం క్రమేణా పెరుగుతోంది.. ఇది సర్వత్రా ఆనందాన్ని నింపుతుండగా, ఆ గ్రామాల్లోని ప్రజానికానికి మాత్రం ఆవేదన మిగుల్చుతోంది. మునకలోకి చేరుతోన్న తోటలు, గ్రామాలను చుట్టుముడుతోన్న నీళ్లతో కన్నీళ్లు పెట్టుకుంటుండటం కనిపిస్తోంది.. పరిహారం, పునరావాసం సమస్య ఎటూ తేల్చకుండానే నీటిని నింపుతున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తుండటం కీలకంగా మారింది.. కండలేరు నిర్వాసిత గ్రామాలైన రేగడిపల్లి, గుండవోలు, రాంపురం, తదితర చోట్ల పరిస్థితి ఇది. కండలేరు జలాశయంలో 60 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తద్వారా సోమశిలలో మాదిరే రికార్డు సృష్టించాలని అధికారులు అడుగులు వేస్తున్నారు. భవిష్యత్తు సాగు, తాగు అవసరాలను తీర్చే మహత్తరమైన ఈ నీటి నిల్వ ప్రక్రియను ఎవరూ తప్పుబట్టరు. ఆ క్రమంలో సామాన్యులను ఇబ్బందులకు గురి చేయడంపై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా 23 ముంపు గ్రామాలుండగా.. కొన్ని గ్రామాల వారు వివిధ ప్రాంతాల్లోని పునరావాసానికి తరలిపోగా.. సమస్యలు పరిష్కారం కాని రేగడిపల్లి, గుండవోలు, తూమాయి గ్రామాలు నేటికీ జలాశయంలోనే ఉంటున్నాయి. వీటిలో కొన్ని గ్రామాలకు ఇప్పటికీ చుక్కలు, నిషేధిత భూములకు పరిహారం అందలేదు. ఒక్క రేగడిపల్లిలోనే ఈ తరహాలో 70 ఎకరాల భూమి ఉంది. ఈ గ్రామానికి పునరావాసమూ చూపకపోవడం సమస్యగా మారింది.
ఇదీ పరిస్థితి
ప్రస్తుతం కండలేరుకు జలాలు పోటెత్తుతుండటంతో ఈ గ్రామాల చుట్టూ నీరు చేరుతోంది. నిమ్మతోటలు నీటమునిగాయి. పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. రైతులు కొంతమేర గట్లు వేసి నీటిని నియంత్రించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఓ దశలో తక్కువగా నీరు వచ్చిన తోటల్లో కాలువలు తీసి చెట్లు మునిగిపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో కొందరికి పరిహారం అందగా అనధికార సాగు చేపట్టారని అధికారులు చెబుతుండగా.. మరికొందరు రైతులు మాత్రం ‘చుక్కల’ జాబితా ఉండి నీళ్లలో దిగుబడి వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు గ్రామాలకు వెళ్లే రోడ్ల చుట్టూ నీరు చేరుతోంది. ఈ స్థితిలో ఆయాచోట్ల మట్టితో రోడ్ల ఎత్తును పెంచే ప్రయత్నం తెలుగుగంగ అధికారులు చేస్తున్నారు. రేగడిపల్లి రోడ్డుకు రూ.20 లక్షలు వ్యయం చేసి పనులు చేస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వం తమ సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించి పరిష్కరించాలని మునకలో ఉన్న గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. ‘ఈనాడు- ఈటీవీ భారత్’ క్షేత్ర పరిశీలనలో తమ బాధలు ఏకరువు పెట్టారు.
రేగడిపల్లి సమీపానికి చేరిన కండలేరు జలాలు
ఇబ్బంది లేదు
- హరినారాయణరెడ్డి, ఎస్‌ఈ, తెలుగుగంగ ప్రాజెక్టు